మహబూబాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దొరల రాజ్యం ఇంకెంత కాలం నడుస్తదో తెల్వదు’అంటూ వ్యాఖ్యానించారు. తాను ఏం మాట్లాడినా తప్పే అంటారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన పండ్ల విక్రయ కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ చొరవతో మిర్చి నుంచి నూనె తీసే ఫ్యాక్టరీ త్వరలోనే ఏర్పాటు కానుందని చెప్పారు. అయితే, వేదికపై ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన టీఆర్‌ఎస్ నేతలు కలుగచేసుకుని ఆ ఫ్యాక్టరీ పనులు డోర్నకల్ నియోజకవర్గంలో ప్రారంభమయ్యాయని తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. జిల్లా కేంద్రంలో ప్రధాన కార్యాలయాలు ఉంటేనే అభివృద్ధి జరుగుతోందన్నారు. ఏం రాజ్యాంగమో, ఎవరు కనిపెట్టారో తెలియదు.. అన్నం పెట్టే రైతుకు ప్రతిసారి అన్యాయం జరుగుతోందన్నారు. అన్నం లేకుంటే బతకలేరని ప్రతి ఒక్కరికీ తెలుసు.. అయినా రైతును మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసేవారిని ఉరి శిక్ష విధించాలన్నారు. గుండు పిన్ను నుంచి వస్తువులను తయారు చేసే వారే ధరలను నిర్ణయిస్తారని, రైతుకు మాత్రం ఆ అవకాశం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా, శంకర్ నాయక్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో మంత్రి సత్యవతి రాథోడ్ పక్కనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment