సాక్షి, హైదరాబాద్:
టీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యవహారం తెలంగాణ టీడీపీలో సంక్షోభానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొత్తు విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు పార్టీలోని ఓ వర్గానికి మింగుడుపడటం లేదు. పొత్తు ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇతర నేతలు పార్టీని వీడి వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తు అనివార్యమన్న సంకేతాలు కొనసాగితే వీలైనంత త్వరగా భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించుకోవాలన్న నిర్ణయానికి వారు వచ్చినట్లు సమాచారం. చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతల సమావేశం మరుసటి రోజే రేవంత్‌రెడ్డి.. పొత్తును వ్యతిరేకిస్తున్న ఇతర నేతలతో సమావేశమైనట్లు తెలిసింది.
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పొత్తు ఉందన్న అనుమానాలు నిజమయ్యే అవకాశం ఉందని, అదే జరిగితే ముందే భవిష్యత్ నిర్ణయించుకోవడం మంచిదని వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు ఈ భేటీలో పేర్కొన్నట్టు తెలిసింది. చంద్రబాబుతో మరోసారి సమావేశమయ్యాకే నిర్ణయం తీసుకుందామని మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ నేత ఒకరు సూచించినా ఇతరులు ఆయనతో ఏకీభవించలేదు. పొత్తు విషయంలో స్పష్టమైన వైఖరి బయటపెట్టలేదంటేనే పొత్తు ఉన్నట్లు లెక్క.. అలాంటప్పుడు మరోమారు సమావేశమైనా ప్రయోజనం ఏమిటన్నది వారి వాదన. కాంగ్రెస్‌లో చేరే అంశంపైనా చర్చ జరిగింది. అయితే ఇప్పుడే ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావడం మంచిది కాదని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం.
చంద్రబాబు సూచనల మేరకే..
తెలంగాణలో పార్టీ మనుగడ కొనసాగించాలంటే టీఆర్‌ఎస్‌తో పొత్తు అనివార్యమని తెలంగాణ టీడీపీలో ఓ వర్గం గట్టిగా కోరుతోంది. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ఏవో కొన్ని సీట్లు కేటాయిస్తే పార్టీ మనుగడకు ఇబ్బంది ఉండదని, ఖమ్మం జిల్లాలాంటి చోట్ల పార్టీకి ఉన్న బలమైన పునాదులను కాపాడుకోవచ్చని ఆ వర్గం నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబు సలహాలు, సూచనల మేరకే ఓ వర్గం నుంచి ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని, అందువల్ల పొత్తు విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని రేవంత్ వర్గం చెబుతోంది. పొత్తులో భాగంగా ఖమ్మం లోక్‌సభ సీటుతోపాటు 15 అసెంబ్లీ సీట్లు కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్లు టీఆర్‌ఎస్ నాయకత్వం నుంచి టీడీపీకి సంకేతాలు అందినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
అదే జరిగితే ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాల్లో వారికి సీట్లు కేటాయించవచ్చని టీడీపీ నాయకత్వం, తద్వారా మరోసారి తాము క్రియాశీలకం అవుతామని టికెట్ ఆశిస్తున్న నేతలు భావిస్తున్నారు. ఈ కారణంగానే సీనియర్ నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లితోపాటు పలువురు నేతలు పొత్తు ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. ‘‘పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీఆర్‌ఎస్‌తో పొత్తు ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే మేం పార్టీని వీడటం తప్ప మరో మార్గం లేదు’’అని నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు అన్నారు.
కాంగ్రెస్ నుంచి ఆఫర్
తమ పార్టీలో చేరాలంటూ రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల రేవంత్ నివాసంలో జరిగిన ఫంక్షన్‌కు సదరు నేత హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు వ్యతిరేక శక్తులన్నీ కలిస్తే బాగుంటుందని ఆ నేత రేవంత్‌కు సూచించినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేత రేవంత్‌కు దగ్గరి బంధువు కూడా. అయితే ఈ విషయంలో తనకు అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృతి చేసుకుంటే గానీ ఓ నిర్ణయానికి రాలేనని రేవంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఒకవేళ రేవంత్ టీడీపీని వీడాలనుకుంటే ఉమా మాధవరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, ఆర్.ప్రకాశ్‌రెడ్డి తదితరులు ఆయనతో నడిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment