
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను సాధించాలన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని, ప్రత్యేక హోదా కోసం బంద్‌లు చేస్తున్న వారిని అరెస్టు చేయించడమే అందుకు నిదర్శనమని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ప్రయోజనాల కోసం బంద్‌ను నిర్వహిస్తూ ఉంటే చంద్రబాబు సహకరించక పోగా వ్యతిరేకంగా పని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా కార్యకర్తలను సైతం అరెస్టు చేయించారని, గతంలో కూడా ఇలాగే హోదా కోసం గళమెత్తిన విద్యార్థి, యువకులపైన పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయించారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కావాలన్న కాంక్షతో సోమవారం రాష్ట్రంలో బంద్ సంపూర్ణంగా విజయవంతం అయిందని ఉమ్మారెడ్డి అన్నారు. బంద్‌ను విఫలం చేసేందుకు చంద్రబాబు విపక్ష నేతలకు నోటీసులు ఇచ్చి, కేసులు పెట్టి పలువురిని అరెస్టు చేసినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్‌ను విజయవంతం చేశారన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కలిసి రాకుండా విడిగా ఈ నెల 20న నిరాహారదీక్ష చేయడం దేనికి? ఎవరిని మభ్య పెట్టడం కోసం? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment