
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాయడం శోచనీయమని.. దీనినిబట్టి ఆయనకు కనీస పరిజ్ఞానం లేదనేది స్పష్టమవుతోందని.. ఇంకా ప్రజల దృష్టిలో ఎందుకు నవ్వులపాలవుతారని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్‌కు యనమల రాసిన లేఖపై ఉమ్మారెడ్డి ఆదివారం తీవ్రంగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన ఏం పేర్కొన్నారంటే..
► శాసనసభల నిర్వహణ అనేది రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటుందనే కనీస పరిజ్ఞానం యనమలకు లేకపోవడం శోచనీయం.
► రాష్ట్ర శాసనసభ తొలిసారి ఆమోదించిన ఈ రెండు బిల్లులను జనవరి 22న శాసన మండలికి వచ్చినపుడు అక్కడ గ్యాలరీలో కూర్చుని టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడుగా వ్యవహరించారు.
► సైగలు చేసి ఈ బిల్లులను ఆమోదించకుండా సభను నిరవధికంగా వాయిదా వేయించారు.
► శాసనసభ తొలిసారి ఆమోదించిన బిల్లులపై కౌన్సిల్ మూడు నెలలపాటు నిర్ణయం తీసుకోనందున మళ్లీ వాటిని అసెంబ్లీ ఆమోదించి జూన్ 17న మండలికి పంపిస్తే అక్కడ మళ్లీ యనమల వాటికి మోకాలడ్డారు.
► చివరకు ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదించకుండా సభను వాయిదా వేయించి ప్రభుత్వోద్యోగులకు జూలై 1న జీతాలు రాకుండా చేశారు. దీనిని బట్టి యనమలకు రాజ్యాంగం అంటే ఏపాటి గౌరవం ఉందో ఇట్టే అర్థమవుతుంది.
► పైగా ఆ రోజు మండలిలో టీడీపీ సృష్టించిన వీరంగం అందరికీ తెలుసు. ఈ పరిస్థితికి యనమల సిగ్గుపడటం లేదా?
► 192 (2) (బి) ప్రకారం తొలుత అసెంబ్లీ పంపిన బిల్లును మూడు నెలల తరువాత కూడా కౌన్సిల్ ఆమోదించకపోతే.. దానిని ఆమోదించనట్లే.
► ఆ తదుపరి రాజ్యాంగం ప్రకారం మళ్లీ రెండోసారి బిల్లును అసెంబ్లీ ఆమోదించి పంపినప్పుడు మండలి ఆమోదించకపోయినట్లయితే ద్రవ్య బిల్లు అయితే 15 రోజులు, సాధారణ బిల్లు అయితే 30 రోజుల తరువాత ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు.
► రాష్ట్ర మంత్రివర్గం ఈ రెండు బిల్లులను ఆమోదించి ఆ తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపుతారు.
► ఈ మాత్రం కనీస పరిజ్ఞానం యనమలకు లేదా? గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపాలని సూచించడం అంటే యనమల సంకుచితత్వానికి నిదర్శనం.
► ప్రజలు దీనిని చూసి నవ్వుకుంటున్నారు. రాజధాని ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు అపహాస్యం, అవమానం చేయడమే కాక దానిని పూర్తిగా పక్కనపెట్టారు.
► కేంద్రం నియమించిన కమిటీని పరిగణనలోకి తీసుకోని వారు ఇప్పుడు వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను కేంద్రానికి పంపాలని సలహా ఇస్తారా?
మీరేమైనా గవర్నర్‌కు సలహాదారు అనుకుంటున్నారా?
► గవర్నర్ ఆమోదానికి పంపిన బిల్లును ఆమోదించవద్దని చెప్పి ఇంకా ప్రజల దృష్టిలో ఎందుకు నవ్వులపాలవుతారు?
► గవర్నర్ ఆమోదం పొంది చట్టాలు రూపొందాలని ప్రజలు కోరుకుంటున్నారు.