
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకుని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పొత్తులను ఖరారు చేస్తారని, ఈ విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం ఉండదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో ఉత్తమ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
‘సర్వేల ఫలితాలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. ఈసారి పొత్తులు లేకున్నా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. మా పార్టీ టికెట్ల కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారంటేనే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందని అర్థమవుతోంది. ఎన్నికలకు కొంత సమ యం ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తాం. ఈ విషయంలో రాహుల్ కూడా సానుకూలంగా ఉన్నారు’అని ఉత్తమ్ పేర్కొన్నారు. సామాజిక సమతౌల్యత, గెలిచే సామర్థ్యమే అభ్యర్థుల ఎంపికలో కీలకం అవుతాయన్నారు.
తనతో అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన చాలా మంది నేతలు టచ్‌లో ఉన్నారని, వారిని త్వరలోనే పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో సెటిలర్లకు తగిన ప్రాధాన్యమిస్తామన్నా రు. నగరంలోని సీమాంధ్రులు, మైనారిటీలు ఈసారి కాంగ్రెస్‌పక్షానే నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనన్నారు.
కేసీఆర్ పుట్టిస్తానన్న భూకంపం ఏదీ?
ముస్లిం రిజర్వేషన్ల కోసం అవసరమైతే ఢిల్లీలో భూకంపం పుట్టిస్తామని సీఎం కేసీఆర్ ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు ఆ భూకంపం ఎటు పోయిందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఏర్పాటు బిల్లులో ఉన్న హామీలే సాధించలేని కేసీఆర్.. తమ పార్టీని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు.
నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు విభజన హామీల గురించి కేసీఆర్ ఎందుకు అడగలేకపోయారని ఉత్తమ్ నిలదీశారు. నాలుగున్నరేళ్లుగా మోదీకి మద్దతు పలుకుతున్న కేసీఆర్ విభజన హామీలపై మాట్లాడాలన్నారు. కేసీఆర్ ముమ్మాటికీ మోదీ ఏజెంటేనని.. కేసీఆర్, టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు.
వచ్చే నెలలో ఒక రోజు రాష్ట్రానికి రాహుల్...
పార్లమెంటు సమావేశాల తర్వాత వచ్చే నెలలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఒకరోజు పర్యటిస్తారని ఉత్తమ్ వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన విద్యార్థులు, మహిళలు, తటస్థులతో సమావేశమవుతారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 31 వేల మంది బూత్ కమిటీ అధ్యక్షులతోనూ ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారని తెలిపారు. ఇకపై రాష్ట్రంలో రాహుల్ పర్యటన ప్రతి నెలా ఉంటుందని ఉత్తమ్ వెల్లడించారు.
ప్రభుత్వంపై తిరగబడండి
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్,టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పండి
మహిళా స్వయం సహాయక సంఘాలతో ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసింది. అభివృద్ధి పనుల పేరిట ప్రభుత్వ పెద్దలు కోట్ల రూపాయల కమీషన్లు కొట్టేశారు. వందల కోట్ల రూపాయలతో బంగళాలు కట్టించుకొని కిరాయి విమానాల్లో తిరుగుతున్నారు. కోట్లాది రూపాయలతో వాహనాలు కొనుగోలు చేసి విలాసాలు చేస్తున్నారు. ఇదంతా మీ సొమ్ముతోనే. కానీ మీకు నిధులు ఇవ్వడానికి మాత్రం వారికి చేతులు రావడం లేదు. తెలంగాణలో ఆ నలుగురు కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారు. మీరంతా తిరగబడాలి. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్‌ఎస్‌లకు బుద్ధి చెప్పి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలి’అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.
సోమవారం గాంధీభవన్‌లో రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలను సీఎం కేసీఆర్ మోసం చేశారని, స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. కేబినెట్‌లో కనీసం ఒక్క మహిళకు కూడా కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదని దుయ్యబట్టారు. మహిళలపై రోజు రోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నా సీఎం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 6 వేల మహిళా సంఘాలకు రూ. లక్ష చొప్పున ఉచితంగా అందిస్తామని, ఒక్కో మహిళా బృందానికి రూ. 10 లక్షల చొప్పున వడ్డీ లేని రుణాలను ఇస్తామని హామీ ఇచ్చారు.
అలాగే సెర్ప్‌లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, బీమా సౌకర్యం, ఆరోగ్య కార్డులు ఇస్తామని, వేతనాలు పెంచుతామన్నారు. ఈ సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతక్క, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు రెండో వారంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన సందర్భంగా మహిళా సంఘాలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారని, రాబోయే ఎన్నికలలో మహిళలకు ఎలాంటి హామీలు ఇవ్వాలో మహిళా సంఘాలతో చర్చించి కాంగ్రెస్ మహిళల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment