సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరువల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ చంద్రబాబు అనుభవాన్ని చూసి ఆనాడు ప్రజలు ఓటు వేశారు. కానీ అందుకు భిన్నంగా ప్రతిచోటా అవినీతి పెరిగింది. రాష్ట్రంలో బాధ్యతారహితంగా పాలన సాగుతోంది. ప్రజాధనంను మంచినీళ్ల ప్రాయంగా దుబారా చేస్తున్నారు. ప్రపంచస్థాయి రాజధానిని నాలుగేళ్లలో ఎలా నిర్మిస్తారు.
ఏడాదికి నలబై నుంచి యాబై రోజులు వాడుకునే అసెంబ్లీ సమావేశాలకు తాత్కాలిక అసెంబ్లీ భవనాలు ఎందుకు?. అసెంబ్లీ తాత్కాలిక భవనాల కోసం రూ.800 కోట్లు ఖర్చు అవసరమా?. భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథార్టీ ముందుకొస్తే టెండర్లు ఎందుకు రద్దు చేశారు?. పోలవరం పనులను కేంద్రం నుంచి ఎందుకు లాక్కున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబే తామే నిర్మిస్తామని బాధ్యత తీసుకున్నారు. ప్రాజెక్ట్ తొందరగా నిర్మాణం జరుగుతుందని అందరూ భావించారు. అరుణ్ జైట్లీ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించే సమయంలోనూ... ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తామని అన్నారు. రీ సెటిల్ మెంట్, రిహాబిలిటేషన్ గురించి మాట్లాడలేదు. సుమారు 21 వేల కోట్లు ఖర్చు అయ్యే అంశంపై స్పందించలేదు.దీనిపై ఆనాడే చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదు. ఆర్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వకుండానే ఎలా ప్రాజెక్ట్ పూర్తవుతుంది.
9,10 షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై తెలంగాణతో ఎందుకు లాలూచీ పడ్డారు. రెండు రాష్ట్రాల మధ‍్య సయోధ్య కుదరడం లేదని కేంద్రానికి ఎందుకు రిఫరెన్స్ పంపలేదు. మూడేళ్ల వరకు రాష్ట్రపతి జోక్యం చేసుకునే గడువును కూడా వృధా చేశారు. ఎన్నోచోట్ల తెలంగాణ ప్రభుత్వంతో మోహమాటానికి పోతున్నారు. దీని వెనుక వున్న అసలు కారణాలు ఏమిటీ..?’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు సూటిగా ప్రశ్నలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment