
సాక్షి, విజయవాడ: జన్మభూమి పేరుతో రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అవాస్తవాలు, అసత్యాలతో జన్మభూమి సందేశం ఉందని తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు తీసుకునే ముందు శ్వేతపత్రం విడుదల చేయాలని తాము డిమాండ్ చేశామన్నారు. వైఎస్సార్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టాయన్నారు. వైఎస్ జగన్ తన పాదయాత్రలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారని చెప్పారు.
జన్మభూమి కార్యక్రమంతో సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు చేసినన్ని కుంభకోణాలు ఎవరైనా చేశారా అని నిలదీశారు. భూకబ్జా కేసులో జైలుకు వెళ్లిన దీపక్‌రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని అనంతపురం జన్మభూమిలో నీతులు చెబుతారా అని అడిగారు. టీడీపీ పచ్చ చొక్కాల సంక్షేమం కోసమే జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఇది జన్మభూమి కాదు... జాదుభూమి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జన్మభూమిలో ఒక్క నిజమైన చెప్పారా? ఆయన చెప్పినవన్నీ నిజాలని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను భోగి మంటల్లో తగలబెడతారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కాదు, చంద్రబాబు కుటుంబ సంక్షేమం కోసమే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment