సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు కాదని.. కుల మీడియా సృష్టించిన నాయకుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. అందులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పాత్ర కూడా ఉందని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల మీడియాలో ఒక్క వారం రోజుల పాటు చంద్రబాబును చూపించకపోతే ఆయన ఉండరని వ్యాఖ్యానించారు. ఈ మీడియా యాజమాన్యాలు చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతూ ప్రజలని మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న వైఎస్సార్‌సీపీని మాత్రం కుల మీడియా తొక్కే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ..‘రాధాకృష్ణ అసలు జర్నలిస్ట్ కాదు.. కొన్నేళ్ల క్రితం సాధారణ వ్యక్తిగా ఉన్న రాధాకృష్ణ ఇప్పుడు ఒక మీడియా సంస్థకు అధినేత ఎలా అయ్యాడు?. అందుకోసం ఆయన ఎన్నో చీకటి పనులు చేశారు. వైజాగ్‌లో ఏదో ఇంటి సమస్య వస్తే అందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరికించే ప్రయత్నం చేశారు. నేను మాట్లాడినట్టు తప్పుడు ఆడియో సృష్టించారు. పైగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిచామని అబద్ధాలు చెప్తున్న రాధాకృష్ణకు.. అది పోలీసుల డ్యూటీ అని తెలియదా?. ఎదుటి వ్యక్తి మీద యుద్ధం ప్రకటించాక వైఎస్సార్‌సీపీ వెనుకడుగు వేయదు. ఆదివారం రోజున చంద్రబాబు, రాధాకృష్ణలకు చెందిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ సంభాషణలు చూస్తే రాధాకృష్ణ ఎంత దుర్మార్గుడో అర్థం చేసుకోవచ్చు. 2010-11లో రాధాకృష్ణ ఇన్వెస్టర్‌లను మోసం చేసినందుకు ఓ కేసు నమోదైంది. తనకు పెట్టుబడులు ఇచ్చి ఆదుకున్న ఇన్వెస్టర్లను రాధాకృష్ణ మోసం చేశారు.
టీడీపీ స్థాపకుడు ఎన్టీఆర్ అయితే ఆయన్ని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు తన సొంత మామనే వాడు అని సంబోధిస్తున్నారు. ఈ వీడియో చూస్తే చంద్రబాబు, రాధాకృష్ణల సంబంధం ఎలాంటిదో అర్థమవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానులు ఎవరు కూడా చంద్రబాబును సహించరు. బురద కుంటలో ఉండాల్సిన వ్యక్తిని మీడియా సంస్థకు అధిపతిని చేస్తే ఎలా ఉంటుందో, ఒక దుర్మార్గున్ని సీఎం చేస్తే ఎలా ఉంటుందో చూడొచ్చు. తోక పత్రిక, కుల పత్రిక ఏదో తప్పుడు వార్తలు సృష్టిస్తారు. వీళ్ల గుణం ఎంటో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఇటువంటి వారికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఎన్నికలను ప్రభావితం చేయడానికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. ఆంధ్రజ్యోతి సృష్టించిన ఫేక్ న్యూస్‌ను తెలుగు దొంగల పార్టీ నాయకులు వైరల్ చేస్తారు. రాధాకృష్ణ మీద ఈసీ అధికారులకు ఫిర్యాదు చేసాం. మేము ఈసీకి ఇచ్చిన ఫిర్యాదుల్లో కేవలం పది శాతం మాత్రమే పరిష్కారం అయ్యాయి. బీజేపీతో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి పొత్తు లేద’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment