వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అవకాశాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదని తెలిసినా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారని, హోదా వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎన్ని కంపెనీలు స్థాపించారు.. ఎన్ని ఉద్యోగాలొచ్చాయో చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు గత వారం రోజులుగా ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని విజయసాయి రెడ్డి ఆదివారం సందర్శించారు.
అనంతరం విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఆ విషయాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. బంద్‌ల వల్ల ప్రయోజనం లేదని సీఎం అంటున్నారని, అధికారంలో లేని రోజుల్లో టీడీపీ ఎన్నిసార్లు బంద్‌కు పిలుపునిచ్చిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం తమతో కలిసివచ్చే ప్రతి పార్టీకి వైఎస్సార్‌సీపీ మద్ధతుగా నిలుస్తుందని వెల్లడించారు. మీ ఎంపీలు కేవలం కేంద్ర మంత్రి పదవులకే రాజీనామా చేశారని, మీకు హోదాపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment