సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇతర రాష్ట్రాలలో సైతం ఆరోగ్యశ్రీని అమలు చేసేలా చర్యలు చేపట్టారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 51 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీని ప్రవేశ పెట్టారని ప్రస్తావించారు. గత పాలనలో చంద్రబాబు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి అందులో కొన్ని వ్యాధులను తొలగించారని విమర్శించారు. సీఎం జగన్.. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో తాము పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా మద్యపానం నుంచి ఆదాయం పోతున్నా.. ముఖ్యమంత్రి దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వైఎస్ జగన్ పాలన చేపట్టి అయిదు నెలలు కాకముందే ప్రతిపక్షనేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల చరిత్రలో చంద్రబాబు చేయలేని పనిని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు నెలల్లో చేసి చూపారని, చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టరా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడమే కాకుండా లబ్ధిదారులకు అందేలా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా చర్యలు చేపట్టామని వివరించారు. రానున్న ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు అందిస్తామని, జనవరి నుంచి అమ్మఒడి పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment