ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ
గద్వాల జిల్లా : బీజేపీ ప్రవేశ పెట్టిన త్రిబుల్ తలాక్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలపడం శోచనీయమని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం వైఎస్సార్ చౌరస్తాలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ..త్రిబుల్ తలాక్ గురించి మాట్లాడుతున్న మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముస్లిం మహిళలకు గడచిన నాలుగేళ్లలో చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లింకు కూడా తన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సబ్ కా వికాస్ అని ఎలా నినదిస్తారని సూటిగా అడిగారు.
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ముస్లిం మైనారిటీల కోసం ఎక్కువ నిధులు కేటాయించిందని, దాని ఫలితంగా నేడు వేల మంది ముస్లిం విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు తమ స్వార్థ రాజకీయాల కోసం ముస్లింలను వాడుకుంటున్నాయని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల మద్దతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. అరవై ఏళ్లుగా ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతునిస్తూ వచ్చినా ప్రయోజనం జరగలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోవధ పేరిట ముస్లింలను హింసిస్తున్నారని అన్నారు. చట్ట సభల్లో, ఉద్యోగాల్లో ముస్లిం జనాభా దామాషాలో ప్రాతినిధ్యం లేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment