బెంగళూరు : కాంగ్రెస్ నేతల్లో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించాలంటే మిగిలిన మంత్రి పదవులను వెంటనే భర్తి చేయాలని కాంగ్రెస్ లోక్‌సభ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ విషయంపై తర్వలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తానని చెప్పారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కర్ణాటకలోని జేడీఎస్, కాంగ్రెస్, బీఎస్‌పీ కూటమి ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు కేటాయించిన మంత్రి పదవుల్లో ఆరు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తే అసమ్మతి వర్గాలు చల్లపడుతాయని ఖర్గే అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై రాహుల్‌తో మాట్లాడి మంత్రిపదవులను తక్షణమే భర్తీ చేయమని కోరతానన్నారు.
హెచ్ డీ కుమార స్వామి నేతృత్వంలోని మంత్రివర్గంలో తమకు స్థానం దక్కనందుకు కాంగ్రెస్ నేతలు ఎం బీ పాటిల్, సతీశ్ జర్కిహోలి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరే కాకుండా రోషన్, హారిస్, రామలింగా రెడ్డి, హెచ్ కే పాటిల్ కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. కేబినేట్‌లో చోటు దక్కని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావెశమై నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం ప్రకారం కాంగ్రెస్‌కు 22 మంత్రి పదవులు, జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు దక్కవలసి ఉంది. అయితే కాంగ్రెస్ కోటాలోని 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. జేడీఎస్ కూడా ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచింది.
మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని జేడిఎస్, కాంగ్రెస్ చెరో 30 నెలలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ..ఒప్పందంలో ఇది లేదని, సంకీర్ణ ధర్మం పాటించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment