సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లేఖపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. ఎమ్మెల్యే వంశీ తనపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. యార్లగడ్డ వెంకట్రావు సోమవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకుంది. ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే ఆయన నామీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిస్కరించేందుకు రాజకీయాల్లోకి రావాలి. ప్రజలకు సమస్యలు సృష్టించేందుకు రాజకీయాల్లోకి రాకూడదు. క్రియశీలక రాజకీయాల్లోకి నేను కొత్తగా వచ్చానే గానీ, మా కుటుంబానికి రాజకీయాలు కొత్తకాదు. ప్రాణహాని ఉందంటూ నేనేమీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విజయవాడ సీపీ కలవమంటేనే మా పార్టీ నేత దాసరి బాలవర్ధన్‌రావుతో వెళ్లి కలిశాను.
చదవండి: (ఎమ్మెల్యే వంశీ బహిరంగ లేఖ వైరల్)
వంశీ తాటాకు చప్పుళ్లకు భయపడితే గన్నవరం వచ్చేవాడినే కాదు. వంశీ ఉడత ఊపులకు భయపడే రకం కాదు నేను. నేను గన్నవరం నియోజకవర్గంలో ప్రతీ గడపకు వెళ్ళాను. ఎప్పుడూ స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పడం కూడా నేను ఇష్టపడలేదు. అతని అరాచకాలు, దోపిడీల గురించి ప్రజలే చెప్పారు. ప్రజలు చెప్పిన దురాగతాలు గురించే నేను చెప్పాను. వంశీ వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ మాట్లాడలేదు. ఎమ్మెల్యే వంశీ ఐదేళ్లు ప్రజలని భయబ్రాంతులకు గురిచేశారు. నేను అమెరికా నుంచి మంచి చేద్దాం అని రాజకీయాల్లోకి వచ్చాను కానీ దోచుకుందాం అని కాదు.
సమస్యలపై విమర్శలు చేసేనే కానీ, నేనెప్పుడూ వంశీపై వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. ఎమ్మార్వోలను మట‍్టి రెవెన్యూ అధికారులగా మార్చుకుని మట్టి తవ్వుకున్న వ‍్యక్తిని కాను. బుద్ధి తక్కువ మాటలు మాట్లాడవద్దు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే తన అక్రమాలపై విచారణ జరుపుతారనే భయంతోనే వల్లభనేని వంశీ నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు. వంశీ తన ఇంటికి వచ్చిన విషయం కూడా నాకు తెలియదు, పోలీస్ శాఖ వాళ్లే నాకు ఆ విషయం చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో చెరువులని అక్రమంగా తవ్వింది నిజమా కాదా. మా పార్టీ అధికారంలోకి వస్తే నా పరిస్థితి ఏంటి అన్న భయంతో వంశీ ఇలా వ్యవహరిస్తున్నాడు. తను చేసిన కుంభకోణాలూ బయటపడతాయి అని భయం. మా పార్టీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం, వంశీ అక్రమ దోపిడీలు అన్ని బట్టబయలు చేస్తాం. గన్నవరం నియోజకవర్గంలో ఎప్పుడూ నేను మట్టి తవ్వలేదు. నియోజకవర్గంలో మొత్తం చెరువులు తవ్వి మట్టి దోచింది నేను కాదు అని చెప్పాను. వంశీ మీరు మీ భార్య 2014 ఎన్నికలకు ముందు బెంగుళూరుకు వెళ్లి జగన్ గారిని కలిసింది వాస్తవం కాదా.
ఆంధ్రజ్యోతి పత్రికలో నా ఇల్లు అక్రమ కట్టడం అని రాశారు, నేను అన్ని అనుమతులు తీసుకునే కట్టాను. వంశీ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేయడం వంశీకి అలవాటు. వంశీ అరాచకాలు టీడీపీ నేతలే భరించలేక పోతున్నారు. నేను వంశీలా సంస్కార హీనుడిని కాదు. ఆయన తనకు అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా రాయించుకున్నారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగిన చరిత్ర వంశీది. గన్నవరం నియోజకవర్గంలో చెరువులని అక్రమంగా తవ్వింది నిజమా కాదా. తను చేసిన కుంభకోణాలూ బయటపడతాయి అని భయం. మా పార్టీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం, వంశీ అక్రమ దోపిడీలు అన్ని బట్టబయలు చేస్తాం. నీ ఇల్లు నువ్వు చక్కపెట్టుకోకుండా మా గురించి నీకు ఎందుకు. నన్ను, మా క్యాడర్ ని భయపెట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి బెదిరింపులకు లొంగే వ్యక్తిని కాదు. బ్రహ్మలింగేశ్వర స్వామి అన్ని చూసుకుంటారు.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment