ఎన్నిసార్లు పిలిచినా వస్తా : జోగి రమేష్‌ | YSRCP Leader Jogi Ramesh Fires On Chandrababu Naidu Govt | Sakshi
Sakshi News home page

ఎన్నిసార్లు పిలిచినా వస్తా : జోగి రమేష్‌

Published Sat, Dec 15 2018 5:29 PM | Last Updated on Sat, Dec 15 2018 5:34 PM

YSRCP Leader Jogi Ramesh Fires On Chandrababu Naidu Govt - Sakshi

సాక్షి, గుంటూరు : చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని విచారణ పేరుతో తనను వేధిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ ప్రభుత్వ వేధింపుల పర్వంలో భాగంగా.. విచారణ నిమిత్తం జోగి రమేష్‌ మరోసారి నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ అరండల్‌పేట పోలీసులు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు.

విచారణ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... వేధింపులకు భయపడకుండా న్యాయపోరాటం చేస్తానని జోగి రమేష్ అన్నారు. నిన్నటి వరకు ఈ కేసులో సాక్షిగా ఉన్న తనకు సీఆర్‌పీసీ 91 కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు ప్రస్తుతం ముద్దాయినంటూ సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులివ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎలా చెబితే పోలీసులు అలా నడుచుకుంటున్నారంటూ ఆరోపించారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే నిందితులను పట్టుకోలేని ప్రభుత్వం తన లాంటి అమాయకులను మాత్రం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ నెల 21న మరోసారి అరండల్‌పేట స్టేషన్‌కు రావాలని చెప్పారు. ఎన్నిసార్లు పిలిచినా వస్తా. మాకు చట్టాలు, న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం చట్టాలను తుంగలో తొక్కుతోంది’ అని జోగి రమేష్‌ వ్యాఖ్యానించారు.

విచారణ ఎందుకంటే..
ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హత్య కేసులో నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అంటూ సోషల్‌ మీడియాలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్డు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న సభ్యత్వ కార్డు విషయమై వైఎస్సార్‌సీపీ జోగి రమేష్‌ ప్రెస్‌మీట్‌ పెట్టడమే ఆయన తప్పయింది. ఈ విషయాన్ని పట్టుకుని పోలీసుల ద్వారా టీడీపీ నేతలు వేధింపులకు గురిచేస్తున్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదుతో జోగి రమేష్‌పై కేసు నమోదు చేసి విచారణ పేరుతో పలుమార్లు తమ చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement