విలేకరులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: శాసనమండలిలో టీడీపీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే.. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అప్రజాస్వామికంగా వ్యవహరించి సభ నడిపారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, ఆదిమూలం సురేష్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. యనమల రామకృష్ణుడు తన తెలివితేటలతో సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సభ నడపమని వేడుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి నిరవధిక వాయిదా అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి బోస్ ఏమన్నారంటే..
► రూల్–90 ప్రకారం ఏదైనా అంశంపై చర్చ చేపట్టాలంటే ఒకరోజు ముందే నోటీసు ఇవ్వాలి. చైర్మన్, సభా నాయకుడితో మాట్లాడి పరిగణనలోకి తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా చైర్మన్ రూల్–90ని పరిగణనలోకి తీసుకున్నారు.
► ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేం.
► ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతోనే టీడీపీ వ్యవహరించింది. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పడ్డ పెద్దల సభను అప్రతిష్ట పాల్జేశారు. టీడీపీకి రాజకీయమే ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజల బాగోగులు అవసరం లేదు.
► ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోలేదు. 33వేల ఎకరాల్లో వ్యాపారం చేసుకోవడం కోసమే ప్రభుత్వ బిల్లులను అడ్డుకున్నారు.
► యనమల రామకృష్ణుడిది పైశాచిక ఆనందం. టీడీపీ సభ్యులు వారి మాట వినకపోతే విధ్వంసం సృష్టిస్తామని బెదిరిస్తున్నారు.
సభా సంప్రదాయాలు, నిబంధనలు వారికి అవసరం లేదు.
శాసన మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. చిత్రంలో మంత్రులు, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు
చరిత్రలో దుర్దినం : మంత్రి కన్నబాబు
► టీడీపీ సభ్యులు సభా నిబంధనల్ని ఉల్లంఘించారు. మెజార్టీ ఉందని ఇష్టానుసారం వ్యవహరించారు. చరిత్రలో ఇది దుర్దినం.
► మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేష్ దాడికి దిగారు. సభలో ఫొటోలు తీసి లోకేష్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
► దీనిపై కచ్చితంగా సభా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. లోకేష్ విధానం సరికాదని చైర్మన్ కూడా చెప్పారు.
► మండలి నిరవధిక వాయిదా వెనుక యనమల ప్లాన్ ఉంది. మెజార్టీ ఉందని సభను అడ్డుకుంటున్నారు.
► డిప్యూటీ చైర్మన్ తీరు ఆక్షేపణీయం. టీడీపీకి తప్ప ఏ ఇతర పార్టీ సభ్యులకు అవకాశం ఇవ్వలేదు.
► మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని నాలుగు గంటలు కోరాం. బీజేపీ, పీడీఎఫ్, ఇతర సభ్యుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోలేదు.
దాడికి దిగారు: మంత్రి ఆదిమూలపు
► టీడీపీ సభ్యులు సభ నియమ, నిబంధనల్ని తుంగలో తొక్కారు. మంత్రులపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.
► పాస్ చేయాల్సిన బిల్లులను అడ్డుకున్నారు. సంక్షేమ కార్యక్రమాల్ని టీడీపీ అడ్డుకుంటోంది.
వాయిదా వేయడం శోచనీయం: చీఫ్ విప్ ఉమ్మారెడ్డి
► శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయి. టీడీపీ సభ్యులు కుట్రతోనే వచ్చారు.
► కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను వాయిదా వేయడం శోచనీయం. టీడీపీ సభ్యులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి అవకాశం ఇవ్వలేదు. సభను విచ్ఛిన్నం చేయడానికి టీడీపీ ప్రయత్నించింది. గత సమావేశాల్లో మాదిరిగానే చైర్మన్ వ్యవహరించారు.
ఇపుడు ఏం జరగనుంది?
ద్రవ్య వినిమయ బిల్లు
► ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండా మండలిలో అడ్డుకోవడంవల్ల మహా అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపులు ఒకటి రెండు రోజులు ఆలస్యం కావడం మినహా ఎలాంటి సమస్య ఉండబోదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.
► శాసనసభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను మండలి 14 రోజులు జాప్యం చేయగలదు తప్ప అంతకుమించి ఎలాంటి అధికారం లేదు.
► ‘ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఈనెల 17న ఆమోదించింది. ఇక 14 రోజులు అంటే ఈ నెలాఖరుతో గడిచిపోతాయి. వచ్చే నెల ఒకటి లేదా రెండో తేదీ నుంచి యథా ప్రకారం చెల్లింపులు చేయవచ్చు’ అని నిపుణులు తెలిపారు.
సీఆర్‌డీఏ రద్దు.. వికేంద్రీకరణ
► ఆర్థికేతర బిల్లులను రెండోసారి మండలిలో అడ్డుకోవడంవల్ల నెల రోజులు అవి చట్టరూపం దాల్చ కుండా ఆగిపోతాయి. నెల రోజుల్లో మండలి ఆమోదించినా, తిరస్కరించినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 ప్రకారం ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే.
► ఏదైనా బిల్లును శాసనసభ ఆమోదించి మండలికి పంపితే అది మూడు నెలలు మాత్రమే దానిని ఆపగలదు. మూడు నెలల్లో తిరస్కరించినా, వెనక్కు పంపినా మళ్లీ అసెంబ్లీ ఆమోదించి పంపవచ్చు. ఇలా వచ్చిన బిల్లును మండలి నెల రోజుల్లోగా ఆమోదించి పంపాలి. ఒకవేళ ఆమోదించకపోయినా తిప్పి పంపకపోయినా ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లేనని ఆర్టికల్ 197 స్పష్టంగా చెబుతోంది.
► పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు, విద్యా హక్కు చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపించి మూడు నెలలు దాటిపోయింది. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపింది. వీటిని మండలిలో చర్చకు రాకుండా అడ్డుకున్నంత మాత్రాన ఒరిగేదేమీలేదని,అవి ఆమోదం పొందినట్లేనని న్యాయ నిపుణులంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment