సాక్షి, విశాఖ : తిరుపతిలో టీడీపీ నిర్వహిస్తున్న సభ... ధర్మ పోరాట సభ కాదని, బీజేపీని తిడుతున్నట్టు నటిస్తూ.. బీజేపీ నేతలకే పదవి ఇస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శించారు. కొండపై దోస్తి.. కొండ కింద ధర్మపోరాటమా? అని ఆయన మండిపడ్డారు. అసలు ధర్మం అనే పదానికి అర్థం మీకు తెలుసా అని ప్రశ్నించారు. మామను వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయనే చంద్రబాబు గురించి చెప్పారని, బాబు అన్యాయస్తుడు, అధర్మస్తుడు అని చెప్పారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వంచన వ్యతిరేక’ దీక్షలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..ప్రజలకు రక్షణగా ఉంటానని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అవినీతి తన బయటపడుతుందని ప్రజలు అండగా ఉండాలని కోరుతున్నారన్నారు. ప్రజల సొమ్మును దోచుకున్నందుకు తమరిని కాపాడాలా..? విజయ్ మాల్యాతో లావాదేవీలను చేసినందుకు కాపాడాలా..? దొంగపనులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నందుకు కాపాడాలా..? అని సూటిగా రెడ్డి ప్రశ్నించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ఏమైంది అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. నాలుగేళ్ల నుంచి బాబు అన్ని అబద్దాలే చెబుతున్నారని మండిపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైయివేట్ పరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని, ఆ ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమని తేల్చి చెప్పారు. అంతేకాక ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, కేంద్రంతో కుమ్మకై ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారన్నారు. రూ.3 లక్షల కోట్ల ప్రభుత్వ ఖజానాను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబాబు నాయుడు దోచుకుని విదేశాలకు తరలించారని, అందుకోసమే కేంద్రం అంటే చంద్రబాబు భయపడుతున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. ధనార్జన విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు తమకు కనపడవని, చేసిన తప్పులకు సీబీఐ విచారణ జరుగుతోందనే భయంతో ఒకవైపు కేంద్రాన్ని విమర్శిస్తూనే, మరోవైపు రాయబారాలు జరుపుతున్నారని ఆరోపించారు.
తాను ప్రస్తావించిన 10 అంశాలపై సీబీఐ విచారణ కోరండని, అప్పుడే సీఎంగా కొనసాగే హక్కు తమకు ఉంటుందని విజయసాయి రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో ఉన్న మూడు జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు కొనసాగిస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు. విభజన హామీలన్నీ నెరవేర్చాలని పార్లమెంట్‌లో ప్రశ్నించామని, రైల్వే జోన్ అంశంలో కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచామని చెప్పారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రైల్వే జోన్ వచ్చే వరకు పోరాటాలు కొనసాగించాలని విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment