
మహింద్రా బొలెరో వాహనాన్ని నాగా బెటాలియన్‌కు చెందిన కొందరు మహిళా పోలీసులు బయటకు తీస్తున్న వీడియో అది.
కోహిమ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా ట్విటర్‌లో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రోడ్డు పక్కన గుంతలో ఇరుక్కుపోయిన మహింద్రా బొలెరో వాహనాన్ని నాగా బెటాలియన్‌కు చెందిన కొందరు మహిళా పోలీసులు బయటకు తీస్తున్న వీడియో అది. దట్టమైన అడవిగుండా వెళ్తున్న పోలీసులకు గుంతలో ఇరుక్కుపోయిన మహింద్రా బొలెరో వాహనం కనిపించింది. అసలే నిర్మానుష్య ప్రాంతం కావడంతో కొద్ది గంటల నుంచి దాన్ని బయటకు తీసేవారు లేక అక్కడే ఉండిపోయింది. ఎవరి సాయం దొరకక ఆ వాహనంలోని వారు అవస్థలు పడ్డారు.
ఈ క్రమంలో అదే దారిగుండా వస్తున్న పోలీసులను సాయం కోరడంతో.. వారు బండి దిగొచ్చి తలో చేయి వేసి బండిని బయటకు తీశారు. ఇది జరిగి నెలలు కావొస్తున్నా.. వీడియో మాత్రం వైరల్ అయింది. ఎం.కికోన్ అనే వ్యక్తి ఈ వీడియోను తాజాగా పోస్టు చేయగా.. ఆనంద్ మహింద్రా షేర్ చేశాడు. ‘బొలెరో వాహనం అక్కడెలా కూరుకుపోయిందో తెలియదు. కానీ, దాన్ని బయటకు తీసినందుకు మహిళా పోలీసులకు థాంక్స్. వారితో తలపడాల్సి వస్తే జాగ్రత్తగా ఉంటాను. వారి సత్తా నాకు తెలుసు’ అని సరదాగా వ్యాఖ్యానించారు.