
ఆవు పేడను ఇంత బాగా ఉపయోగించడం నేనెప్పుడూ చూడలేదు...
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ విలవిల్లాడి పోతున్నారు. ఇక గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా భగభగలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అక్కడ ప్రస్తుతం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణంలో సూర్యుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఓ మహిళ కారు మొత్తాన్ని పేడతో అలికింది.
ఈ విషయం గురించి...‘ ఆవు పేడను ఇంత బాగా ఉపయోగించడం నేనెప్పుడూ చూడలేదు’ అంటూ రూపేశ్ అనే వ్యక్తి సదరు మహిళ కారు ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో..‘ఎండ నుంచి తప్పించుకునేందుకు భలే ఐడియా ఇచ్చారుగా మేడమ్. ఇందులో కూర్చుంటే ఏసీ వేసుకోకున్నా సరే చాలా చల్లగా ఉంటుందట. మీరూ ట్రై చేయండి’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకునేందుకు, చలికాలంలో వేడిమి కోసం ఇంటి గోడలను పేడతో అలుకుతున్నారన్న సంగతి తెలిసిందే.