
తండ్రి ఎప్పుడూ తన కూతురిని ఓ రాజకుమారిలా చూసుకుంటాడు అని అనడంలో సందేహమే లేదు. తండ్రి కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కూతురు ఇష్టపడిన వాటిని ఇవ్వడానికి తండ్రి ఎంతగా తపిస్తాడో అందరికీ తెలిసిందే. తాజాగా ఓ తండ్రి తన కూతురు ఇష్టంగా పెంచుకునే ఓ చిట్టెలుక తప్పిపోవడంతో ఆఫీసుకు కూడా వెళ్లకుండ దానిని వెతికిపెట్టాడు. ఇందుకు సంబంధించిన సంభాషణ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్టెప్ వీర్మన్(19) అనే యువతి ప్రేమగా పెంచుకునే చిట్టెలుక కనిపింలేదు. విషయం తెలుసుకున్న వీర్మన్ తండ్రి కూతురికి కాల్ చేసి బాధపడ్డాడు. ఈ సంభాషణను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ తండ్రి బాధపడుతుంటే స్టెప్ ఓదార్చిన మెసేజ్‌లను చూసి నెటిజన్లు వారి అనుబంధాన్ని అర్థం చేసుకుంటున్నారు. వీర్మన్‌కు ఇష్టమైన చిట్టెలుక కనిపించకపోవడానికి కారణం తనే అంటూ క్షమించమని ఆమె తండ్రి అడిగిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ‘నేను తిరిగి హాస్టల్‌కు వెళ్లాక మా నాన్న దానికి చాలా దగ్గరయ్యారు. ఈరోజు అది కనిపించకపోవడంతో దాని కోసం బాధపడుతున్న తీరు చూస్తే.. ఆయనది ఎంత స్వచ్ఛమైన మనసో తెలుస్తోంది’ అనే క్యాప్షన్‌తో వీర్మన్ పోస్టు చేశారు.
వీర్మన్ షేర్ చేసిన పోస్టులో.. చిట్టెలుక కనిపించకపోవడంతో జరిగిన విషయం చెప్పడానికి ఆమె తండ్రి కంగారుపడుతూ కాల్ చేయమని మెసేజ్ చేశాడు. అది చూసిన ఆమె తండ్రిని ఓదారుస్తూ ‘ఏం కాదు నాన్న అది ఒక ఎలుక మాత్రమే.. మీరు కంగారు పడకండి’ అని ధైర్యం చెప్పారు. దీంతో ఆమె తండ్రి అది తప్పిపోవడానికి తానే కారణమని బాధపడుతూ కూతురిని క్షమాపణలు అడుగుతూ... ‘నిజంగా ఇది బాధాకరమైన విషయం.. ఒకవేళ అది తిరిగి రాకపోతే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను, ఇక రేపు ఆఫీసుకు కూడా వెళ్లకుండా దాన్ని వెతుకుతా’ అని అన్నారు.
దీనికి వీర్మన్ ‘డాడి మీరు కచ్చితంగా ఆఫీసుకు వెళ్లాల్సిందే అది కేవలం ఒక చిట్టెలుక మాత్రమే.. కానీ మీరు ఓ న్యాయవాది’ అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత అతడు ఎలుక బొను వద్ద వేరు శనగ క్రీమ్‌ను ఉంచి దాని ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశాడు. చివరికి ఆ ఎలుక దాని బోనులోనే ఉందని తెలుసుకున్న అతను సంతోషంతో స్టెప్‌కు మెసేజ్ చేశాడు. అది చూసిన నెటిజన్లు ‘మీ డాడి నిజంగా మంచి మనసు కలవాడు అని, ‘చిట్టెలుక దొరికినందుకు సంతోషం.. మీ నాన్న నీ మాటలను రుజువు చేశాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
my dad took over my hamster once i went back to college and ended up getting really attached and today he escaped and this goes to prove how truly pure my father is pic.twitter.com/JmTJl6jFBI
— Steph Veerman (@stephyj725) November 25, 2019