భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మూడో రోజు మ్యాచ్లో భారత్ ఆటగాడు కేఎల్ రాహుల్ 118 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మూడో రోజు మ్యాచ్లో భారత్ ఆటగాడు కేఎల్ రాహుల్ 118 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ మూడో రోజు ఆటలో 54.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులతో కొనసాగుతోంది. భారత్ ఆటగాడు రాహుల్, కెప్టెన్ వీరాట్ కోహ్లీ భాగస్వామ్యంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ రాహుల్ (164 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు), భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ (26 బంతుల్లో 13 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం మరో 454 పరుగులు వెనుకబడి ఉంది.
రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అదే రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.