
ముంబై : టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. క్రికెట్, ఆటగాళ్లకు సంబంధించి అనేక చర్చలను, విషయాలను తన యూట్యూబ్ ఛానల్ వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అంతేకాకుండా తనకు నచ్చిన, స్పూర్తి పొందిన పలు ఫోటో, వీడియోలను సైతం షేర్ చేస్తుంటాడు. ఇక పలు ఆసక్తికర, వివాదాలకు సంబంధించిన విషయాలపై చర్చిండంలో ఈ వ్యాఖ్యాత ఎప్పుడూ ముందుంటాడు. టీమిండియా టెస్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్లలో ఎవరు గొప్పా అనే దానిపై స్పష్టతనిచ్చాడు. (‘భారత్‌లో అతడిని ఎదుర్కోవడం కష్టం’)
‘ప్రస్తుత క్రికెట్‌లో అశ్విన్, లయన్‌లు ఇద్దరు గొప్ప స్పిన్నర్లు. సులువుగా వికెట్లు పడగొట్టగలరు. అయితే వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవాలంటే మాత్రం నేను లయన్ వైపే మొగ్గుచూపుతాను. ఎందుకుంటే అతడి బౌలింగ్ యాక్షన్ నాకు బాగా నచ్చుతుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించకున్నా బౌన్స్ రాబట్టి వికెట్లను పడగొడతాడు. బంతిపై అతడికి మంచి నియంత్రణ ఉంటుంది. ఎక్కడ, ఎలా బౌలింగ్ చేయాలో బాగా తెలుసు. ఉపఖండపు పిచ్‌లపై ముఖ్యంగా భారత్ మైదానాలలో లయన్‌తో పోలిస్తే వికెట్ల వేటలో అశ్విన్ చాలా ముందుంటాడు. అయితే ఉపఖండపు పిచ్‌లపై లయన్ రాణిస్తూనే ఆసీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మైదానాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. అందుకే ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో లయన్ ది బెస్ట్ అని చెబుతున్నాను’ అంటూ చోప్రా పేర్కొన్నాడు. ఇక అశ్విన్ 71 టెస్టుల్లో 365 వికెట్లు పడగొట్టగా.. లయన్ 96 టెస్టు మ్యాచ్‌ల్లో 390 వికెట్లను చేజిక్కించుకున్నాడు. (క్రికెట్‌లో నెపోటిజమ్ రచ్చ.. చోప్రా క్లారిటీ)