అథ్లెట్స్ ఖుష్బీర్ కౌర్, మనీశ్‌లపై వేటు
న్యూఢిల్లీ: భారత మహిళా రేస్‌వాకర్ ఖుష్బీర్ కౌర్ పై వేటు పడింది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఆసియా రేస్ వాకింగ్ చాంపియన్ షిప్ కోసం ఎంపిక చేసిన జట్టు నుంచి ఆమెను తప్పించింది. జాతీయ చాంపియన్ షిప్‌లో శనివారం 20 కిలో మీటర్ల ఈవెంట్ నుంచి ఖుష్బీర్ కౌర్ చెప్పాపెట్టకుండా తప్పుకోవడంతో ఏఎఫ్‌ఐ ఆమెను జాతీయ జట్టు నుంచి తొలగించింది. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల ఖుషీ్బర్ 2014 ఇంచియోన్ సియా క్రీడల్లో 20 కిలోమీటర్ల విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఆసియా రేస్ వాకింగ్ ఈవెంట్ జపాన్ లోని నోమిలో వచ్చే నెల 20 నుంచి జరుగనుంది. మరోవైపు ‘రియో ఒలింపియన్ ’ మనీశ్ సింగ్ రావత్‌ను కూడా జాతీయ జట్టు నుంచి ఏఎఫ్‌ఐ తప్పించింది.
జాతీయ చాంపియన్ షిప్‌లో 20 కిలోమీటర్ల నడక పోటీలో బరిలోకి దిగాల్సిన అతను ముందస్తు సమాచారం ఇవ్వకుండా చివరి నిమిషంలో వైదొలిగాడు. జాతీయ పోటీల్లో పాల్గొనని అథ్లెట్లను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేయబోమని ఏఎఫ్‌ఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గుర్బచన్ సింగ్ రణ్‌ధావా స్పష్టం చేశారు. జాతీయ శిబిరాల నుంచి వారిని తొలగించాలని కూడా ఏఎఫ్‌ఐకి సిఫార్సు చేస్తామని ఆయన చెప్పారు. వారి కోచ్ అలెగ్జాండర్ ఇచ్చే వివరణను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏఎఫ్‌ఐ కార్యదర్శి సీకే వాల్సన్ మాట్లాడుతూ ఇలాంటివి పునరావృతవైుతే భవిష్యతు్తలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.