లండన్: ప్రపంచకప్ ఫైనల్లో చోటు చేసుకున్న ‘బెన్ స్టోక్స్.. ఓవర్‌త్రో’పై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ అదనపు పరుగులతోనే ఇంగ్లండ్ గెలిచిందని లేకుంటే న్యూజిలాండ్ చేతిలో ప్రపంచకప్ ఉండేదని పలువురు విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఓవర్‌త్రోపై ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆఖరి ఓవర్‌లో మార్టిన్ గప్టిల్ విసిరిన బంతి సరిగ్గా బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లడంతో అంపైర్లు ఆరు పరుగులు ఇచ్చారు. అయితే స్టోక్స్ అంపైర్ల దగ్గరికి వెళ్లి అదనపు పరుగులు ఇంగ్లండ్‌కు అవసరం లేదని వారించాడు. అయితే నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందే అంటూ వారు సర్దిచెప్పారు. అంపైర్ల నిర్ణయంపై స్టోక్స్ కూడా అసహనం వ్యక్తం చేశాడు’అంటూ అండర్సన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
‘ఆరు’ఇవ్వడం తప్పే..
ఇక అంపైర్లు 6 పరుగులు ఇవ్వడం పెద్ద వివాదస్పదమైంది. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికి అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్ చేసిన ఘోర తప్పిదం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. ఐసీసీ నిబంధనల మేరకు ఆతిథ్య జట్టుకు లభించాల్సింది కేవలం 5 పరుగులే. 19.8 నిబంధన మేరకు ఓవర్‌త్రో ద్వారా బౌండరీ లభించినప్పుడు ఆ పరుగులతో పాటు ఫీల్డర్ యాక్షన్ పూర్తయ్యే సమయానికి బ్యాట్స్‌మెన్ తీసిన పరుగులను కూడా కలిపి ఇవ్వాలి. అయితే ఇక్కడ బెన్‌స్టోక్స్, ఆదిల్ రషీద్‌లు రెండో పరుగు పూర్తి చేయకుండానే బంతి స్టోక్స్ బ్యాట్ తాకి బౌండరీకి వెళ్లింది. బౌండరీ ద్వారా లభించిన 4 పరుగులకు.. వారు చేసిన ఒక్క పరుగును జోడించి ఐదు పరుగులు ఇవ్వాలి. కానీ అంపైర్లు ఇది గుర్తించకుండా 6 పరుగులిచ్చి కివీస్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు. కాగా, ఓవర్‌త్రోపై న్యూజిలాండ్ ఆటగాళ్లకు, సారథి విలియమ్సన్‌కు బెన్ స్టోక్స్ క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే. కావాలని చేయలేదని, అనుకోకుండా జరిగిందని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment