భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ మ్యాచ్ ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారింది. రేపటి మ్యాచ్‌లో భారత వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ తీస్తే టెస్ట్‌ల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండగా.. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ మరో ఐదు వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 700 వికెట్ల అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంటాడు.
రేపటి మ్యాచ్ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు 100వ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్ అతనికి చిరకాలం గుర్తిండిపోతుంది. ఈ మూడు ప్రత్యేకతలే కాకుండా రేపటి మ్యాచ్ ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు చిరస్మరణీయంగా మారే అవకాశం ఉంది. రాజ్‌కోట్ టెస్ట్‌తో యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ అహ్మద్, దృవ్ జురెల్ టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైపోయింది.
ఆఖరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్ప ఈ ఇద్దరి టెస్ట్ అరంగేట్రాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇలా రేపటి నుంచి ప్రారంభంకాబోయే రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ ఐదుగురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారనుంది.
ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలువగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు సమంగా ఉండటంతో రాజ్‌కోట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యతను పెంచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. టీమిండియాను సీనియర్ల గైర్హాజరీ సమస్య కలవరపెడుతున్నప్పటికీ యువ ఆటగాళ్లు ఉత్సాహంగా కనిపిస్తూ గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచారు. మరోపక్క ఇంగ్లండ్ టీమ్.. భారత్‌ను దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తూ ప్రణాళికలు రచిస్తుంది. మరి రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment