
విరాట్-కుంబ్లేల వివాదంపై ధావన్ ఇలా..
గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టులో చోటు చేసుకున్న విభేదాలపై స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కాస్త భిన్నంగా స్పందించాడు.
ఆంటిగ్వా: గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టులో చోటు చేసుకున్న విభేదాలపై స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కాస్త భిన్నంగా స్పందించాడు. ప్రధానంగా కోచ్ గా పని చేసి ఆకస్మికంగా వైదొలిగిన అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లి వివాదంపై అడిగిన ప్రశ్నకు ధావన్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. 'నేను కుంబ్లే శిక్షణలో ఎక్కువ మ్యాచ్ లు ఆడలేదు. కాబట్టి విభేదాలపై నేనేమీ మాట్లాడలేను.అయితే ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయంతో పాటు స్వాభిమానం కూడా ఉంటుంది. అలానే కోహ్లి, కుంబ్లే, ధోని ఇలా ఎవరికి తగ్గ వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. అందులో్ ఎటువంటి సందేహం లేదు'అని ధావన్ తెలివిగా సమాధానం చెప్పాడు. అయితే తన గేమ్ పైనే ప్రస్తుతం దృష్టిసారించినట్లు ధావన్ పేర్కొన్నాడు. దేశానికి సేవ చేయడంతో పాటు, తన లక్ష్యాన్ని చేరడమే ముఖ్యమన్నాడు.
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ధావన్ వరుసగా రెండు అర్ధశతకాలతో మెరిశాడు. మరొకవైపు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో 338 పరుగులు తన ఫామ్ ను నిరూపించుకున్నాడు ధావన్. ఒక సెంచరీతో పాటు రెండు అర్ధ శతకాలను ధావన్ తన ఖాతాలో వేసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ ధావన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 125.