టీ20లో 'జేజమ్మ' | Arundhati Reddy Select In T20 Women Cricket Team | Sakshi
Sakshi News home page

టీ20లో జేజమ్మ

Published Fri, Aug 31 2018 7:37 AM | Last Updated on Fri, Sep 7 2018 11:15 AM

Arundhati Reddy Select In T20 Women Cricket Team - Sakshi

మిథాలీరాజ్, అరుంధతీరెడ్డి

భారత మహిళల క్రికెట్‌ జట్టులో నగరం నుంచి మరో అమ్మాయి స్థానందక్కించుకుంది. ఇప్పటికే మిథాలీరాజ్‌కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయగా... మరికొంత మంది ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌లో ఆడగా, ఇప్పుడు మరో అమ్మాయి జట్టులో చోటు సంపాదించుకోవడం విశేషం.నగరంలోని డిఫెన్స్‌ కాలనీకి చెందినఅరుంధతీరెడ్డి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం భారత జట్టుకు ఎంపికైంది.ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలు...

సాక్షి, సిటీబ్యూరో :ఆధునిక యువతులు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. ఆకాశంలో,అవకాశాల్లో తమ ముద్రతో ప్రగతిపథాన సాగుతున్నారు. క్రీడల్లోనూ ఎదుగుతూ పురుషులకు తామేమీ తీసిపోమనినిరూపిస్తున్నారు. ఆ కోవకు చెందిన యువతే అరుంధతి. భారత మహిళల టీ–20 జట్టులోకి ఎంపికయ్యింది. 21 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టనుంది. నగరంలోని సైనిక్‌పురి డిఫెన్స్‌ కాలనీకి చెందిన అరుంధతిరెడ్డి ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. ఈ క్రమంలోక్రికెట్‌ ప్రపంచంలో తన ప్రస్థానం. అంచలంచెలుగా ఎదిగిన విధానం. ఎదుర్కొన్న ఇబ్బందులుమహిళల క్రికెట్‌ జట్టుకు ఎంపికైన విశేషాలను, అనుభవాలను పంచుకుందిలా.. - చైతన్య వంపుగాని

అన్న ఆడుతుంటే చూసేదాన్ని..  
అన్న రోహిత్‌ మంచి క్రికెటర్‌. ప్రతిరోజూ ఉదయం ప్రాక్టీస్‌కి వెళ్లేవాడు. అన్నవాళ్లు ఆడుతుంటే బయట నిలబడి ఆటను చూస్తూ బాల్స్‌ అందించేదాన్ని. ప్రాక్టీస్‌ అనంతరం పిల్లలందరం కలిసి గల్లీలో క్రికెట్‌ ఆడేవాళ్లం. మళ్లీ ఉదయం ప్రాక్టీస్‌కి వెళ్లేవాళ్లం. దీంతో క్రికెట్‌పై ఆసక్తి బాగా పెరిగింది.అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాలనే ఆకాంక్ష ఎక్కువైంది. ప్రతిరోజూ జింఖానాగ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేసేదాన్ని.   

మిథాలీ బ్యాటింగ్‌ స్టైల్‌కు ఫిదా
ఇండియన్‌ టీం కెప్టెన్‌ మిథాలీరాజ్‌ ఆటను చూస్తూ పెరిగాను. ఆమెను నేను అక్కా అని పిలుస్తా. రెండేళ్ల క్రితం సౌత్‌ సెంట్రల్‌ రైల్వేస్‌కు సెలెక్ట్‌ అయినప్పుడు మిథాలీ అక్కతో నాకు మరింత అనుబంధం పెరిగింది. కోచ్‌ మూర్తి సర్‌ కూడా 3, 4 గంటల పాటు మిథాలీ బ్యాటింగ్‌ ఎలా చేస్తుందో గమనించు, నేర్చుకో అని చెప్పేవారు. మిథాలీ అక్క షాట్లకు ఫిదా అయ్యాను.   

అమ్మ ప్రోత్సాహం మరువలేను..
మా అమ్మ పేరు భాగ్య. ఆమె మంచి వాలీబాల్‌ ప్లేయర్‌. ఆర్థిక పరిస్థితుల కారణంగా తను ఆటను మధ్యలో వదిలేసింది. ప్రస్తుతం టీచర్‌గా చేస్తోంది. నా ప్రాక్టీస్‌ కోసం తెల్లవారుజామున 3గంటలకు నిద్రలేచే వాళ్లం. ప్రాక్టీస్‌ 9.30 గంటల దాకా చేసేదాన్ని.  మళ్లీ సాయంత్రం 4 గంటలకు గ్రౌండ్‌కు వచ్చేవాళ్లం. రాత్రి 7.30గంటల వరకు అమ్మ కూడా నాతోనే ఉండేది. అమ్మ నా కోసం ఎంతో కష్టపడింది. నేను ఈ స్థాయికి ఎదగడానికి ఆమె శ్రమ, ప్రోత్సాహం ఎంతో ఉంది.   

ఇండియా ‘గ్రీన్‌’తో అందరి దృష్టిలో పడ్డా..
ఇటీవల జరిగిన ఉమెన్స్‌ చాలెంజర్స్‌ ట్రోఫీలో ‘ఇండియా గ్రీన్‌’ టీంలో ఆడాను. ‘ఇండియా బ్ల్యూ’ టీంలో మిథాలీ ఉన్నారు. ఓ మ్యాచ్‌లో నేను మిథాలీని బౌల్డ్‌ చేశాను. అన్ని మ్యాచ్‌ల్లో రాణించడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాను. దీంతో భారత టీ20 జట్టులో అవకాశం దక్కింది.  

ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లివే..  
ఇప్పటి వరకు అండర్‌– 19, 23, సీనియర్స్, సీనియర్‌ జోనల్స్, ఛాలెంజర్స్, ఇండియా ‘ఎ’, సౌత్‌ సెంట్రల్‌ రైల్వేస్‌ మ్యాచ్‌లలో ఆడాను. వీటన్నింటిలో ఆల్‌రౌండర్‌ ప్రతిభను కనబరిచా. సెప్టెంబర్‌ 19 నుంచి శ్రీలంకలో టీ20 సిరీస్‌ ఉంది. వీటిలో సత్తా చాటి మున్ముందు వన్డేల్లోకి కూడా ఎంపికవుతాననే నమ్మకముంది.  

అనన్య మెసేజ్‌తో సర్‌ప్రైజ్‌
ఈ నెల 23న ఎప్పటిలాగానే క్రికెట్‌ గ్రౌండ్‌కి వెళ్లి ప్రాక్టీస్‌ చేశా. సాయంత్రం 6.30గంటలకు ఇంటికి బయలుదేరుతూ.. టేబుల్‌లో ఉన్న ఫోన్‌ తీసి చెక్‌ చేస్తుంటే నా స్నేహితురాలు అనన్య ఉపేంద్ర నుంచి మెసేజ్‌ వచ్చింది. ‘కంగ్రాట్స్‌ డియర్‌.. యూ ఆర్‌ సెలక్టెడ్‌ ఇన్‌ ఇండియా టీ20 టీమ్‌’ అని ఉంది. ఒక్కసారిగా కళ్లు చెమర్చాయి. ఆ వెంట వెంటనే ఎనిమిది మంది నుంచే కంగ్రాట్స్‌ మెసేజెస్‌ వచ్చాయి. వెంటనే అమ్మకు ఫోన్‌ చేసి ‘అమ్మా.. నేను ఇండియన్‌ టీంకి సెలెక్ట్‌ అయ్యానని చెప్పాను’. ఆ తర్వాత కెనడాలో ఉన్న అన్న రోహిత్‌కి ఫోన్‌ చేసి చెప్పాను. ఇంటికి వెళ్లేసరికి బంధువులు, స్నేహితులు ఫ్లవర్‌ బొకేస్‌ ఇచ్చి కంగ్రాట్స్‌ చెప్పారు.

మహిళా క్రికెట్‌కు ఆదరణ..  
మహిళా క్రికెట్‌పై అందరిలోనూ ఆదరణ పెరుగుతోంది. చాలామంది అమ్మాయిలు క్రికెట్‌ వైపు చూస్తున్నారు. అరుంధతికి ఎన్నో సలహాలు ఇచ్చాను.  ఆమె అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్‌ నుంచి నా పేరు ఒక్కటే వినిపించేది. ఇప్పుడు నాతో పాటు అరుంధతి పేరు అంతర్జాతీయంగా వినిపించడం ఎంతో ఆనందంగా ఉంది. అరుంధతిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఎంతో మంది ముందుకు రావాలి.– మిథాలీరాజ్, భారత మహిళల వన్డేజట్టు కెప్టెన్‌

నాకెంతో గర్వంగా ఉంది
అరుంధతి అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికవ్వడం నాకెంతో గర్వంగా ఉంది. రెండేళ్ల పాటు సౌత్‌సెంట్రల్‌ రైల్వేస్‌ తరఫున ఆడిన సమయంలో తన పట్టుదలను పసిగట్టాను. కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్‌ ఎంపికవుతుందనే నమ్మకం వచ్చింది. మిథాలీ తర్వాత అరుంధతి ఇండియన్‌ జట్టులో చోటు సంపాదించడం సంతోషంగా ఉంది.        – రాయప్రోలు మూర్తి, కోచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement