కెప్టెన్సీ నుంచి ఉద్వాసన తప్పదా?
కరాచీ:ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో ఘోర ఓటమిని ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు సమాయత్తమవుతోంది. ఆసీస్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో పాకిస్తాన్ కేవలం ఒక విజయాన్ని మాత్రమే సొంతం చేసుకోవడంతో పీసీబీ దిద్దుబాటు చర్యలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ వన్డే క్రికెట్ కెప్టెన్ అజహర్ అలీని ఆ పదవి నుంచి తప్పించే యోచనలో పీసీబీ పెద్దలు ఉన్నారు. దీనిలో భాగంగా లాహోర్లో పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్, చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ వుల్ హక్, ప్రధాన కోచ్ ముస్తాక్ అహ్మద్ల భేటీ అయ్యారు.
ఈ భేటీలో అజహర్ అలీని తప్పించడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరొ క్రికెటర్ సర్పరాజ్ అహ్మద్కు వన్డే పగ్గాలు అప్పజెప్పేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ట్వంటీ 20 కెప్టెన్గా ఉన్న సర్పరాజ్ను వన్డే కెప్టెన్గా చేయాలనేది పీసీబీ పెద్దల భావనగా ఉంది. మూడు ఫార్మాట్ల క్రికెట్కు ఒక కెప్టెన్నే నియమిస్తే ఆశించిన ఫలితాలు సాధించడానికి దోహదం చేస్తుందని వారు యోచిస్తుననారు. అయితే ఇంకా టెస్టు కెప్టెన్ గా మిస్బావుల్ హక్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వన్డే కెప్టెన్గా సర్ఫరాజ్ను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
అజహర్ అలీ నేతృత్వంలోని పాకిస్తాన్ ఆశించిన ఫలితాలు సాధించకపో్వడంతో ఆ జట్టు వన్డే ర్యాంకింగ్స్ లో పెద్దగా మార్పు రాలేదు. గతంలో అతని సారథ్యంలో తొమ్మిది ర్యాంకుకు పడిపోయిన పాకిస్తాన్.. ఆ తరువాత ఒక ర్యాంకును మాత్రమే మెరుగుపరుచుకుని ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. 2019వరల్డ్ కప్ కు పాక్ నేరుగా అర్హత సాధించాలంటే వారు ఇదే ర్యాంకును కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
అయితే అజహర్ అలీ కెప్టెన్సీలో పెద్దగా ఫలితాలు రాకపోవడంతో పీసీబీలో ఆందోళన కనిపిస్తోంది. అతని వ్యక్తిగత ప్రదర్శన బాగానే ఉన్నా, నాయకుడిగా అలీ విఫలమయ్యాడు. దీనిలో భాగంగానే వన్డే కెప్టెన్సీ మార్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. 2015 వరల్డ్ ట్వంటీ 20 అనంతరం ఆ ఫార్మాట్ కెప్టెన్సీ కి షాహిద్ ఆఫ్రిది బలవంతంగా వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజహర్ అలీని కెప్టెన్నీ తప్పిస్తే మాత్రం అది కచ్చితంగా పాక్ క్రికెట్ జట్టులో మరొక భారీ మార్పుగానే చెప్పొచ్చు.