ప్రపంచకప్‌లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో అద్భుతమైన ఆటతో పాటు అప్పుడప్పుడు అనూహ్య ఘటనలు సాధారణం. ఆటగాళ్ల దూకుడుతో మైదానంలో ఘర్షణలు సహజం. కొన్నిసార్లు రిఫరీ నిర్ణయాలు కూడా అగ్గి రాజేస్తాయి. ఇన్నేళ్లలో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌నకు సంబంధించి జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనలను చూస్తే...–సాక్షి క్రీడా విభాగం
హ్యాండ్ ఆఫ్ గాడ్ (1986)
చరిత్రలో ఇది ఎవరూ మరచిపోలేని ఘటన. 1986 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా సూపర్ స్టార్ మారడోనా చేసిన ఒక గోల్ అలా వివాదంగా నిలిచిపోయింది. ఇంగ్లండ్ గోల్ కీపర్ పీటర్ షిల్టన్‌ను తప్పించి గాల్లో ఎగురుతూ మారడోనా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. అయితే మారడోనా తన చేతిని తగిలించాడంటూ ఇంగ్లండ్ ఆటగాళ్లు రిఫరీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. తాను హెడర్ ద్వారా నే గోల్ చేశానని, చేయి తగిలించలేదని ఆ తర్వాత చెప్పుకున్న మారడోనా... నిజంగా అక్కడ చేయి గనక తగిలి ఉంటే అది దేవుడిదే అయి ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఈ గెలుపు అర్జెంటీనాను ఆ తర్వాత విజేతగా నిలపడంలో కీలకమైంది.
దక్షిణ కొరియా మ్యాచ్ ఫిక్సింగ్ (2002)
సొంతగడ్డపై జరిగిన వరల్డ్‌కప్‌లో దక్షిణ కొరియా రిఫరీలను వాడుకుని ఫిక్సింగ్‌కు పాల్పడిందనే వార్తలు వచ్చాయి. ఇటలీతో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో, ఆ తర్వాత స్పెయిన్‌తో జరిగిన సెమీస్‌లో సాధారణ రిఫరీ నిర్ణయాలు కూడా ప్రత్యర్థులకు ప్రతికూలంగా రాగా, చిన్న చిన్న కారణాలకే ఎల్లో కార్డులు చూపించి రిఫరీలు కొరియా పని సులువు చేశారని వినిపించింది.
కప్పే ఎత్తుకెళ్లారు
1966లో ఇంగ్లండ్‌లో వరల్డ్ కప్ టోర్నీ జరగడానికి నాలుగు నెలల ముందు అభిమానులు చూసేందుకు కప్‌ను అందుబాటులో ఉంచారు. అది చోరీకి గురవడంతో తీవ్ర వివాదం చెలరేగింది. దొంగిలించినవారు 15 వేల పౌండ్లు డిమాండ్ చేశారు. అయితే చివరకు ఓ కుక్క దానిని వెతికి పెట్టడం విశేషం.
ప్రాణం తీసిన సెల్ఫ్ గోల్...
1994 ప్రపంచకప్‌తో సంబంధం ఉండి, మైదానం బయట జరిగిన మరో ఘటన ఫుట్‌బాల్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాతో మ్యాచ్‌లో కొలంబియా ఆటగాడు ఆండ్రియస్ ఎస్కోబార్ చేసిన సెల్ఫ్ గోల్ చివరకు అతడి ప్రాణాన్నే తీసింది. ఈ మ్యాచ్‌లో అమెరికా మిడ్ ఫీల్డర్ జాన్ హార్క్స్ పాస్‌ను అడ్డుకునే క్రమంలో ఎస్కోబార్ బంతి తమ గోల్‌పోస్ట్‌లోకే పంపించాడు. దీంతో అమెరికా 2–1తో గెలవగా కొలంబియా నిష్క్రమించింది. మ్యాచ్ జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ఒక బార్ ముందు ఒంటరిగా ఉన్న ఎస్కోబార్‌పై దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో వారు ‘గోల్... గోల్’ అని అరవడాన్ని బట్టి చూస్తే అది మ్యాచ్ ఫలితం నేపథ్యంలో చేసిన హత్యేనని తేలింది.
పోలీసులొచ్చారు...
1962లో ఇటలీ, చిలీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఫుట్‌బాల్ కంటే కూడా ఆటగాళ్ల మధ్య పంచ్‌లు, కిక్‌లు ఎక్కువైపోయి మూడుసార్లు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. అత్యంత వివాదాస్పదంగా సాగిన ఈ మ్యాచ్‌ను చిలీ 2–0తో గెలుచుకుంది.
తలతో కుమ్మేశాడు
జర్మనీ ఆతిథ్యమిచ్చిన 2006 వరల్డ్ కప్‌లో నాటి ఫ్రాన్స్ స్టార్ జినెదిన్ జిదాన్ హెడ్ బట్ ఉదంతం పెద్ద సంచలనం సృష్టించింది. ఇటలీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. మ్యాచ్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్న సమయంలో ఇటలీ ఆటగాడు మటెరాజితో మాటామాటా పెరగడంతో జిదాన్ తలతో అతడిని బలంగా ఢీ కొట్టాడు. దాంతో రిఫరీ రెడ్ కార్డ్ చూపించి జిదాన్‌ను బయటకు పంపించాడు. అదే జిదాన్‌కు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. తాను చనిపోవడానికైనా సిద్ధమే కానీ మటెరాజికి క్షమాపణ మాత్రం చెప్పనని తర్వాత అతడు స్పష్టం చేశాడు.
గోల్æకాదు... గగ్గోల్...
2010లో ఇంగ్లండ్, జర్మనీ మధ్య మ్యాచ్‌లో వివాదాస్పద గోల్ నమోదైంది. ఫ్రాంక్ లంపార్డ్ (ఇంగ్లండ్) కొట్టిన కిక్ గోల్‌పోస్ట్ పైన తగిలిన బంతి లోపల పడి బౌన్స్ అయి బయటకు వచ్చింది. దానిని అందుకున్న కీపర్ మాన్యూల్ న్యూయెర్ తిరిగి ఆటను కొనసాగించగా రిఫరీ గోల్ ఇవ్వలేదు. రీప్లేలో బంతి స్పష్టంగా లోపలి వైçపు పడినట్లుగా కనిపించింది. ఇలాంటి వివాదాలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో 2014 ప్రపంచకప్‌లో కొత్తగా గోల్‌లైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు.
కీపర్ క్రూరత్వం...
1982 ప్రపంచకప్‌లో జర్మనీ గోల్ కీపర్ హెరాల్డ్ షూమాకర్ అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. సెమీస్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు ప్యాట్రిక్ బటిస్టన్... జర్మనీ పెనాల్టీ ఏరియాలోకి దూసుకొచ్చాడు. షూమాకర్ బంతిని ఆపడం కాకుండా తన శరీరంతో బటిస్టన్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ దెబ్బకు బటిస్టన్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు పళ్లు ఊడిపోయాయి. దాదాపు అచేతన స్థితిలో స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిశాక షూమాకర్‌పై కనీస చర్య కూడా తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment