ముంబై : టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాది గొప్ప బౌలింగ్ నైపుణ్యమని, అతడు వేసే యార్కర్లు, బౌన్సర్లు తనను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. బుమ్రా బౌలింగ్‌లో ఆడటం ఎంతో కష్టమని పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం వార్నర్ మాట్లాడుతూ... 'బ్రెట్‌లీ లాంటి బౌలర్ కొంత తడబడుతూ 150 కి.మీ వేగంతో బంతులు వేయడాన్ని నేను ఊహించలేను. అందుకు అలవాటు పడాలంటే కాస్త సమయం అవసరం. బుమ్రాది గొప్ప బౌలింగ్ నైపుణ్యం. అతడి బౌన్సర్లు, యార్కర్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. బుమ్రా బౌలింగ్ చేసే సమయంలో అతను తన యాక్షన్‌లో చేసే మార్పు నాకు కష్టంగా అనిపిస్తుంది. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ గంటకు 140 కి.మీ వేగంతో స్వింగ్ చేసినప్పుడు ఎదుర్కొనేందుకు కొంత ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు బుమ్రా విషయంలో కూడా అలాగే ఇబ్బందులకు గురవుతున్నా. అయితే క్రీజులో నిలదొక్కుకోవడంతోనే పరుగులు చేశా' అని తెలిపాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడే మైదానంలో టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ భారత జట్టుపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వార్నర్ (112 బంతుల్లో 128 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114 బంతుల్లో 110 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో ఆసీస్ వికెట్ కోల్పోకుండా సునాయాస విజయాన్ని అందుకుంది. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం రాజ్‌కోట్‌లో జరగనుంది.
(వార్నర్ సరికొత్త రికార్డు)
Comments
Please login to add a commentAdd a comment