
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు (డిసెంబర్ 15) వన్డే క్రికెట్ చరిత్రలోనే భారత్ - శ్రీలంక జట్లకు ప్రత్యేకం. రాజ్‌కోట్ వేదికగా నరాలు తెగేంత ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ సగటు భారత అభిమానికి గుర్తుండే ఉంటుంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇరు జట్లు 400కు పైగా పరుగులు చేయడం రెండోసారి మాత్రమే. అంతేకాకుండా క్రికెట్ చరిత్రలోనే ఇరు జట్ల టాప్-3 బ్యాట్స్‌మెన్‌లు 50పైగా పరుగులు చేయడం తొలి సారి. అప్పటికి వన్డేల్లో భారత్ కూడా అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం. (తర్వాత 2011లో వెస్టిండీస్‌పై భారత్ 418 పరుగులు చేసింది.)
ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ పరుగుల తుఫానునే సృష్టించారు. నువ్వా-నేనా అన్నట్లు చివరి వరకు సాగిన ఈ సమరంలో నెహ్రా అద్భుత బౌలింగ్‌తో విజయం భారత్‌నే వరించింది. మ్యాచ్ భారత్ గెలిచినా ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఓ ప్రత్యేకంగా నిలిచిపోయింది.
టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(146) విరోచిత ఇన్నింగ్స్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్(63), మహేంద్ర సింగ్ ధోని(72)లు తోడవ్వడంతో భారత్ అలవోకగా శ్రీలంకకు 414 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ భారీ లక్ష్యానికి ఎంత మాత్రం భయపడని ఆతిథ్య జట్టు దిల్షాన్(160) భారీ ఇన్నింగ్స్‌కు సంగక్కర(90), ఉపుల్ తరంగ (67)లు చెలరేగడంతో 411 పరుగులు చేసి 3 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.
ధోని మార్క్ కెప్టెన్సీ..
చివరి ఓవర్లో లంక విజయానికి 11 పరుగుల కావాలి.. క్రీజులో ఆలౌరౌండర్ బ్యాట్స్‌మన్ మాథ్యూస్ ఉన్నాడు. అప్పటి వరకు చాలా పరుగులిచ్చిన నెహ్రాకు బౌలింగ్ ఇచ్చాడు ధోని. ఇక శ్రీలంక విజయం సులవనుకున్నారు అందరూ.. కానీ ఇక్కడ ధోని మార్క్ కెప్టెన్సీ లంక విజయాన్ని అడ్డుకుంది. మాథ్యూస్ అవుట్ చేయడంలో సఫలమైన నెహ్రా ఒక్క బౌండరీ ఇవ్వకుండా కేవలం ఏడు పరుగులే ఇచ్చాడు. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించడం భారత అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ మధుర క్షణం ప్రతి అభిమాని గుండెల్లో నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment