
ముంబై ఇండియన్స్ కు ఢిల్లీ షాక్
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై పోరాడి ఓడింది. ముంబై ఆటగాళ్లలో రోహిత్ శర్మ(65; 48 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్),కృణాల్ పాండ్యా(36; 17 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. వీరిద్దరి తరువాత అంబటి రాయుడు(25) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు.
టాస్ గెలిచిన ముంబై తొలుత ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ఆదిలోనే డీ కాక్(9) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత ఐయ్యర్ (19), కరుణ్ నాయర్(5) కు కూడా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఢిల్లీ 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.అయితే ఫస్ట్ డౌన్ లో వచ్చిన సంజూ శాంసన్(60;48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ తేరుకుంది. అతనికి జతగా జేపీ డుమినీ (49 నాటౌట్; 31బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ పార్దీవ్ పటేల్(1) వికెట్ ను ఆదిలోనే నష్టపోయింది. అనంతరం రోహిత్ శర్మ, అంబటి రాయుడుల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేసింది. ఈ జోడీ 53 పరుగుల చేసిన అనంతరం రాయుడు రెండో వికెట్ గా అవుటయ్యాడు. అయితే అప్పటికే క్రీజ్లో కుదురుకున్న రోహిత్ శర్మకు కృనాల్ పాండ్యా నుంచి చక్కటి సహకారం లభించింది. ముంబై స్కోరు 103 పరుగుల వద్ద కృనాల్ అవుట్ కావడంతో జట్టు మరోసారి కష్టాల్లో పడింది. ఆ తరువాత ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు పది పరుగుల తేడాతో ఓటమి చెందింది. దీంతో ముంబై మూడో ఓటమిని మూట కట్టుకోగా, ఢిల్లీ వరుసగా మూడో విజయాన్ని సాధించింది.