
ధోని అరుదైన ఘనత!
ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన టీమిండియా పరిమిత ఓవర్ల సారథి మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
రాంచీ: ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన టీమిండియా పరిమిత ఓవర్ల సారథి మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం రాంచీలో శ్రీలంకతో జరిగిన రెండో టీ 20లో టీమిండియా విజయం సాధించిన అనంతరం ధోని తన అంతర్జాతీయ టీ 20 కెప్టెన్సీ రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. ఇప్పటివరకూ 56 టీ 20 లకు కెప్టెన్ వ్యవహరించిన ధోని పొట్టి ఫార్మెట్ లో తన విజయాల సంఖ్యను 30కు పెంచుకున్నాడు. తద్వారా టీ 20ల్లో ఒక జట్టుకు అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్ గా అద్వితీయ ఘనతను ధోని సొంతం చేసుకున్నాడు.
ధోని సారథ్యంలో టీమిండియా 24 మ్యాచ్ల్లో ఓడిపోగా, మరొక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో ధోని ట్వంటీ 20 విజయాల రేటు 55.45 శాతంగా ఉంది. ధోని తరువాత స్థానాల్లో ఫోర్ట్ ఫీల్డ్(ఐర్లాండ్) 23 విజయాలతో రెండో స్థానంలో ఉండగా, డారెన్ సామీ(వెస్టిండీస్) 22 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు. షాహిద్ ఆఫ్రిది(పాకిస్తాన్) 16 విజయాల్ని సొంతం చేసుకుని నాల్గో స్థానంలో ఉన్నాడు.