దేవధర్ ట్రోఫీ తమిళనాడుదే
⇒‘శత’క్కొట్టిన దినేశ్ కార్తీక్
⇒ఫైనల్లో భారత్ ‘బి’పై గెలుపు
విశాఖపట్నం: ఈ సీజన్‌లో తమిళనాడు ఆటగాళ్లు జోరుమీదున్నారు. ఇప్పటికే దేశవాళీ పరిమిత ఓవర్ల విజయ్ హజారే టైటిల్ గెలిచిన తమిళనాడు తాజాగా దేవధర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో 42 పరుగుల తేడాతో భారత్ ‘బి’ జట్టుపై విజయం సాధించింది. టాస్ నెగ్గిన తమిళనాడు మొదట బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీస్కోరు చేసింది. దినేశ్ కార్తీక్ (91 బంతుల్లో 126; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించాడు.
జగదీశన్ (55; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 136 పరుగులు జోడించారు. ధవల్ కులకర్ణి 39 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ ‘బి’ జట్టు 46.1 ఓవర్లలో 261 పరుగులు మాత్రమే చేసింది. గుర్‌కీరత్ సింగ్ (64; 7 ఫోర్లు), శిఖర్ ధావన్ (45; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మనీశ్ పాండే (32), హర్‌ప్రీత్ సింగ్ (36) మెరుగనిపించారు. తమిళనాడు బౌలర్లలో రాహిల్ షా 3, సాయికిషోర్, మొహమ్మద్ చెరో 2 వికెట్లు తీశారు.