నాకూ ఆశ్చర్యంగానే ఉంది | Don't know if I have hit peak, says Virat Kohli | Sakshi
Sakshi News home page

నాకూ ఆశ్చర్యంగానే ఉంది

Published Wed, May 18 2016 12:55 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

నాకూ ఆశ్చర్యంగానే ఉంది - Sakshi

నాకూ ఆశ్చర్యంగానే ఉంది

ప్రస్తుత క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి. దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. తన షాట్ సెలక్షన్, నిలకడతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా లక్ష్యాలను ఛేదించడంలో ఏ ఫార్మాట్‌లో అయినా తనకు తిరుగే లేదు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో వేగంగా 7000 పరుగులు, వేగంగా 25 సెంచరీలు, అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సగటు, ఐపీఎల్ లో ఒకే సీజన్‌లో మూడు సెంచరీలు, ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు.

ఒక రకంగా తను తన కెరీర్‌లోనే ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఇంత నిలకడ ఎలా సాధ్యం? టి20ల్లోనూ సంప్రదాయ వన్డే తరహా ఆటతీరుతో ఈ రికార్డులు ఎలా సాధిస్తున్నాడు..? ఇలా పలు అంశాలపై విరాట్ కోహ్లి ఇంటర్వ్యూ...


ఈ ఫామ్‌ను, రికార్డులను ఊహించలేదు     
ఛేజింగ్‌లో నాపై ఒత్తిడి ఉండదు
ఏబీ నాకు మంచి స్నేహితుడు    
విరాట్ కోహ్లి ఇంటర్వ్యూ


ఒకే సీజన్లో మూడు సెంచరీలు. ఇప్పటివరకూ ఏ క్రికెటర్ ఒకే సీజన్‌లో చేయనన్ని పరుగులు. టి20 క్రికెట్‌లో ఇంత నిలకడ ఎలా?
నిజాయితీగా చెప్పాలంటే నాకూ చాలా ఆశ్చర్యంగానే ఉంది. నిజానికి ఆ మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సెంచరీ చేస్తాననే ఆలోచన నాకు లేదు. వీలైనంత వేగంగా ఆడి జట్టు స్కోరును పెంచాలనే ప్రయత్నం చేసే క్రమంలో ఈ సెంచరీలు వచ్చాయి. ఈ ఫార్మాట్‌లో విజయ రహస్యం కూడా ఇదే. జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే ప్రయత్నం చేస్తే వ్యక్తిగత రికార్డులు వాటంతట అవే వస్తాయి.
 
టి20ల్లో కూడా వన్డే తరహాలోనే ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. టి20లకు కొత్తగా ఏమీ ప్రయత్నించలేదా?
ప్రస్తుతం నా ఫామ్ చాలా బాగుంది. కాబట్టి ప్రత్యర్థి జట్టులో బౌలర్లు నన్ను కట్టడి చేయడానికి కచ్చితంగా ప్రణాళికలతోనే వస్తారు. ఆఫ్ స్టంప్ బయట బంతులు వేసి బౌండరీ దగ్గర ఇద్దరు ఫీల్డర్లను ఉంచుతారు. కచ్చితంగా నేను ఏదో ఒక తప్పు చేస్తానని ఎదురు చూస్తారు. ఒక 20 బంతులు క్రీజులో నిలబడితే తర్వాత పరుగులు అవే వస్తాయి. ఏ ఫార్మాట్‌కైనా ఇదే వర్తిస్తుంది. తొలి 20 బంతులు షాట్లకు వెళ్లకుండా సింగిల్స్ తీయడంలో ఇబ్బందేమీ లేదు. చివరి ఓవర్లలో సిక్సర్లు కొట్టగల నైపుణ్యం నాలో ఇప్పుడు పెరిగింది. కాబట్టి వన్డే తరహాలోనే కుదురుకుని ఆడినా నష్టం లేదు.
 
లక్ష్య ఛేదనలో మరింత నిలకడ చూపిస్తారు. ఏ ఓవర్లో ఎలా ఆడాలనే ప్రణాళికను ముందే సిద్ధం చేసుకుంటారా?
జట్టు విజయానికి ఎన్ని పరుగులు కావాలి? దీనిని బట్టే ఛేజింగ్‌ను ప్లాన్ చేయాలి. ప్రత్యర్థి జట్టులోని బౌలర్లు ఎవరు? ఎవరి కోటా ఓవర్లు ఎన్ని మిగిలున్నాయి? ఏ బౌలర్‌ని లక్ష్యం చేసుకోవాలి..? ఇవన్నీ చూసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించాలి. వ్యక్తిగత రికార్డులను పట్టించుకోకుండా జట్టు లక్ష్యాన్ని గుర్తుంచుకుని ఆడితే ఛేజింగ్ చేయడం సులభం. నిజానికి చాలామంది ఛేజింగ్ చేయడం ఒత్తిడితో కూడుకున్న పని అని చెబుతారు. కానీ నాకు మాత్రం ఇదే సులభం అనిపిస్తుంది. ఎన్ని చేయాలో తెలిశాక, దానిని బట్టి భాగస్వామ్యాలు నిర్మించుకుంటూ వెళితే సరిపోతుంది.
 
ఇంత అద్భుతమైన ఫామ్‌లో ఉంటే బ్యాట్స్‌మన్ రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. కానీ మీరు మాత్రం మీ శైలి క్రికెట్ నుంచి పక్కకు వెళ్లరు. మీ నిలకడకు ఇదే కారణమా?
నిలకడ కావాలంటే మన ప్రాక్టీస్, ఆహారం, బ్యాటింగ్ శైలి మనకు బోర్ కొట్టేంత ప్రాక్టీస్ చేయాలి. ఆటను తేలికగా తీసుకోకూడదు. ఒక్కోసారి నాకు కూడా తొలి బంతినే సిక్సర్ కొట్టాలనే కోరిక కలుగుతుంది. కానీ నియంత్రించుకుని నా శైలిలోనే ఆడాలి. ఆటను ఎప్పుడూ గౌరవించాలి. ఆటను తేలికగా తీసుకుంటే ఒక్కో పరుగు కోసం కూడా కష్టపడాల్సి వస్తుంది. మన సామర్థ్యం మీద మనకు నమ్మకం ఉండాలి, అదే సమయంలో ఆట మీద గౌరవంతో పాటు ఒకే పనిని పదే పదే ఒకే రీతిలో చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడు నిలకడగా పరుగులు వస్తాయి.
 
డివిలియర్స్, కోహ్లి కలిసి ఆడుతుంటే ప్రత్యర్థులంతా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఒకరి మీద ఒకరికి గౌరవం, నమ్మకం కూడా బాగా ఉన్నట్లుంది?
అవును. మేం ఇద్దరం కలిసి ఆడే సమయంలో ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చుకోం. ఎందుకంటే ఏం చేయాలి, ఎలా ఆడాలనే విషయంపై ఇద్దరికీ అవగాహన ఉంది. ఎప్పుడో ఒక సందర్భంగా ‘కాస్త నెమ్మదిగా, జాగ్రత్తగా ఆడు’ అనే మాట మినహా ఏమీ చెప్పుకోము. మైదానం బయట మేమిద్దరం మంచి స్నేహితులం. అది ఆడే సమయంలోనూ కనిపిస్తుంది. నిజానికి తనతో కలిసి ఆడటం చాలా బాగుంటుంది. మనం ఎప్పుడూ చూడని షాట్లు కూడా ఏబీ ఆడతాడు. అలా అని వాటిని నేను ప్రయత్నించను. ఎవరి శైలి వారిది. ఏబీతో కలిసి ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాను.
 
మిగిలిన వారితో పోలిస్తే కోహ్లి ఎందుకు భిన్నం?
చిన్నప్పటి నుంచీ యావరేజ్ ఆటగాడిగా మిగిలిపోవడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఏ దశలో, ఏ ప్రత్యర్థిపై ఏ మ్యాచ్ ఆడినా అందరికంటే నేను ఎక్కువ పరుగులు చేయాలని, జట్టును నేనే గెలిపించాలనే తపన ఉండేది. అయితే చాలా మంది దానిని అహంకారంగా చూశారు. కానీ నేను ఎప్పుడూ జట్టు కోసం ఆడే మనిషిని. విజయాన్ని మించిన కిక్ ఏదీ ఇవ్వదు. అందుకే ప్రతి మ్యాచ్ గెలవాలనే తపన ఉంటుంది.
 
ఇటీవల కాలంలో సచిన్, కోహ్లిలను పోల్చుతున్నారు. దీనిపై స్పందన?
ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. సచిన్ ఓ దిగ్గజం. ఆయనకు ఎవరూ సరితూగరు. నేను రెండేళ్లుగా బాగా ఆడుతున్నా. కానీ సచిన్ 24 సంవత్సరాల పాటు దేశానికి సేవ చేశాడు. ఓ వ్యక్తిగా నాకు ఆయనే స్ఫూర్తి. ఈ తరంలో ఎవరితో చూసుకున్నా... సచిన్ రెండు రెట్లు ఎక్కువ.
 
గాయమున్నా బరిలోకి...
నేడు పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లి గాయం ఉన్నా బరిలోకి దిగుతున్నాడు. సోమవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. గాయానికి ఎనిమిది కుట్లు పడే అవకాశం ఉందని మ్యాచ్ అనంతరం కోహ్లి స్వయంగా తెలిపాడు. ప్లేఆఫ్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సి నందున పంజాబ్‌తో ఆడాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు పంజాబ్  బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ పక్క టెముకల్లో నొప్పి కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement