ఇక టీ20ల్లోనూ డీఆర్ఎస్
లండన్: ఇప్పటిదాకా టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్) ఇక నుంచి ట్వంటీ 20ల్లోనూ కనిపించనుంది. ఈ ఏడాది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి టీ 20ల్లో డీఆర్ఎస్ను అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు నెల క్రితం ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదనకు తాజాగా ఆమోద ముద్రవేసింది.
ఒక్క తప్పుడు నిర్ణయం పూర్తి మ్యాచ్‌నే మార్చేసే పరిస్థితి ఈ పొట్టి ఫార్మాట్‌లో కూడా ఉంటుందనేది క్రికెటర్ల అభిప్రాయం. వన్డేలకు, టెస్టులకు మాత్రమే డీఆర్ఎస్ ను పరిమితం చేయడమే కాకుండా, ఈ విధానాన్ని టీ 20ల్లోనూ అమలు చేయాలనే డిమాండ్ ఎక్కువైంది. దీనిలో భాగంగానే మే నెలలో ఐసీసీ క్రికెట్ కమిటీ.. టీ 20ల్లో డీఆర్ఎస్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకు ఐసీసీ నుంచి అంగీకారం లభించడంతో అన్ని ఫార్మాట్లలో ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం ఏర్పడనుంది.