నా పట్ల కఠినంగా ప్రవర్తించారు!
దునేదిన్: భారత్ తో రెండో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ డీఆర్ఎస్ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డు ప్లెసిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ వివాదం చాలా పెద్దదైనప్పటికీ దాన్ని ఐసీసీ చాలా తేలిగ్గా తీసుకోవడాన్ని డుప్లెసిస్ తప్పుబట్టాడు. అసలు మొత్తం విషయాన్ని పక్కకు పెట్టిన ఐసీసీ.. ఆ రగడపై కనీస చర్యలు ఎందుకు చేపట్టలేదో తనకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశాడు.
'ఇటీవల మా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు నేను బాల్ టాంపరింగ్ చేశానని ఆ జట్టు తీవ్రంగా ఆరోపించింది. నోటిలో ఉన్న మింట్ ను తీసి రుద్దానంటూ అనవసర రాద్దాంతం చేసింది. దానిపై ఐసీసీ కూడా తీవ్రంగా స్పందించింది. నేను ఏ తప్పు చేయలేదని విన్నవించుకున్నా చివరికు జరిమానా విధించారు. అప్పుడు నా పట్ల ఐసీసీ కఠినంగా ప్రవర్తించింది. మరి ఇప్పుడు ఇంత పెద్ద విషయాన్ని ఎలా పక్కకు పెట్టేసింది. ఆ వివాదంపై ఏ ఆటగాడిపై చర్యలు కనీస చర్యలు తీసుకోలేదు. ఇది నన్ను తీవ్రంగా ఆశ్చర్యపరిచిన విషయమే కాదు.. చాలా సీరియస్ గా ఆలోచింపజేసిన అంశం'అని డు ప్లెసిస్ పేర్కొన్నాడు.