యాషెస్ సిరీస్ మూడో టెస్టు డ్రా
యాషెస్ సిరీస్ మూడో టెస్టు డ్రా
Published Tue, Aug 6 2013 1:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
వరుసగా రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యం... ఇంటా బయటా విమర్శలు... ఇక యాషెస్ కోసం ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి... ఈ నేపథ్యంలో మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు జూలు విదిల్చింది. విజయం కోసం పోరాడింది. కానీ క్లార్క్‌సేనకు వరుణుడు అడ్డుగా నిలిచాడు. వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టు డ్రాగా ముగిసింది. మిగిలిన రెండు టెస్టుల్లో ఆసీస్ గెలిచి సిరీస్ సమం చేసినా... టైటిల్ దక్కే అవకాశం లేదు.
మాంచెస్టర్: వరుసగా రెండు పరాజయాల అనంతరం ఎలాగైనా యాషెస్ మూడో టెస్టును గెలవాలని ప్రయత్నించిన ఆస్ట్రేలియా జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ టెస్టు చివరి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో పూర్తి ఆట సాధ్యం కాకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఇప్పటికే ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంతో ఉండగా మిగిలిన రెండు టెస్టులు కోల్పోయినా డి ఫెండింగ్ చాంపియన్ హోదాలో యాషెస్‌ను తమ దగ్గరే ఉంచుకున్నట్టవుతుంది. అంతకుముందు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకు ఆసీస్ 332 పరుగుల లక్ష్యాన్ని విధించింది.సోమవారం చివరి రోజు ఆట వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్... ఆట నిరవధికంగా ఆగే సమయానికి 20.3 ఓవర్లలో మూడు వికెట్లకు 37 పరుగులు చేసింది. ప్రారంభం నుంచే ఇంగ్లండ్‌ను ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. మూడో ఓవర్‌లోనే కుక్‌ను హారిస్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో ట్రాట్ (11), పీటర్సన్ (8) అవుట్ అయ్యారు. లంచ్ విరామానంతరం మూడు బంతులు పడిన తర్వాత భారీ వర్షం కురిసింది. ఏమాత్రం తెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో ఇక ఆసీస్ ఆశలు వదులుకుంది. అటు అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల అనంతరం ఇంగ్లండ్ యాషెస్‌ను నిలబెట్టుకోవడం 1928-29 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మైకేల్ క్లార్క్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 9 నుంచి జరుగుతుంది.
Advertisement
Advertisement