
స్వింగ్ స్ట్రగుల్ వల్లే భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యం చెందారని
వెల్లింగ్టన్: వరుస మూడు వన్డేల్లో ఘన విజయం సాధించి న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా.. అనూహ్యంగా నాలుగో వన్డేలో ఘోరపరాభావాన్ని చవిచూసింది. బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యంతో 92 పరుగులకే కుప్పకూలి దారుణ పరాభావాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇక చివరి వన్డేలో సైతం టాప్-4 బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. ఈ దశలో భారత్‌కు మరో ఓటమి తప్పదా? అని అందరూ భావించారు. కానీ అంబటి రాయుడు, విజయ్ శంకర్‌ల అద్భుత భాగస్వామ్యం, చివర్లో పాండ్యా మెరుపులు.. జాదవ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆతిథ్య జట్టుకు గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే బ్యాట్స్‌మెన్ దారుణ వైఫల్యానికి కారణం స్వింగ్‌ను ఎదుర్కోకపోవడమేనని భారత మాజీ పేసర్, స్వింగ్ స్పెషలిస్ట్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఉపఖండ ఫ్లాట్ పిచ్‌లపై ఆడిన భారత ఆటగాళ్లకు స్వింగ్ పిచ్‌లపై ఆడటం కష్టంగా మారిందని చెప్పుకొచ్చాడు. ఇండియా టుడే చానెల్‌తో మాట్లాడుతూ.. ‘బ్యాట్స్‌మెన్ వైఫల్యానికి ప్రధాన కారణం.. మన ఆటగాళ్లు ఎక్కువగా రెగ్యూలర్ ఫ్లాట్ పిచ్‌లపై ఆడటం. దీంతో బ్యాట్స్‌మెన్ బంతి స్వింగ్ అయినప్పుడు అంతేవేగంతో వారి ఫుట్‌వర్క్‌ను మార్చుకోలేకపోతున్నారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల్లో మన బ్యాట్స్‌మెన్ స్వింగ్ ఎదుర్కోకపోవడానికి ఇదే ప్రధాన కారణమని నేను ఫీలవుతున్నాను. స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్ భయాందోళనకు గురవుతున్నారు’ అని చెప్పుకొచ్చాడు.
ఇక న్యూజిలాండ్ పేస్ ద్వయం ట్రెంట్ బౌల్ట్, హెన్రీలు భారత బ్యాట్స్‌మెన్‌ను స్వింగ్‌తో ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. నాలుగో వన్డేలో ట్రెంట్ బౌల్ట్ ఏకంగా 5 వికెట్లతో చెలరేగగా... చివరి వన్డేలో హెన్రీ 4 వికెట్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. వీరి స్వింగ్ దాటికి పటిష్టమైన భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ప్రపంచకప్ ముందు బ్యాటింగ్‌లోని లొసుగులు తేటతెల్లమయ్యాయి. స్వింగ్ పిచ్‌లపై కసరత్తు చేయాలన్న విషయం తెలిసొచ్చింది.