
మ్లాడెనోవిచ్‌కు చుక్కెదురు
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో 30వ సీడ్ తిమియా బాసిన్‌స్కీ
సెమీస్‌లో బాసిన్‌స్కీ, ఒస్టాపెంకో
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో 30వ సీడ్ తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్), అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఒస్టాపెంకో (లాత్వియా) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో బాసిన్‌స్కీ 6–4, 6–4తో 13వ సీడ్ క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)ను బోల్తా కొట్టించగా... ఒస్టాపెంకో 4–6, 6–2, 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 11వ సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించింది. గురువారం జరిగే సెమీఫైనల్లో బాసిన్‌స్కీతో ఒస్టాపెంకో తలపడుతుంది. యాదృచ్చికంగా గురువారమే వీరిద్దరి పుట్టినరోజు కావడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)ను ఓడించిన మ్లాడెనోవిచ్ క్వార్టర్ ఫైనల్లో మాత్రం తడబడి మూల్యం చెల్లించుకుంది.
అంతకుముందు మంగళవారం వర్షం కారణంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లకు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో నాలుగు క్వార్టర్ ఫైనల్స్‌కు బదులుగా రెండు మాత్రమే సాధ్యమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం మంగళవారమే రాఫెల్ నాదల్ (స్పెయిన్), కరెనో బుస్టా (స్పెయిన్); జొకోవిచ్ (సెర్బియా), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ల మధ్య పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సింది. అయితే ఈ రెండు క్వార్టర్ ఫైనల్స్‌ను బుధవారానికి వాయిదా వేశారు.