చికెన్ ఇవ్వడానికి వెళ్లి...
‘అవకాశాలు ఎవరినీ వెతుక్కుంటూ రావు... వాటిని మనమే గుర్తించి అందిపుచ్చుకోవాలి. అప్పుడే ఎవరైనా తాము ఎంచుకున్న రంగంలో విశేషంగా రాణించగలుగుతారు’ హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల మొహమ్మద్ అహ్మద్ సరిగ్గా ఇదే పనిచేశాడు. తన తండ్రి ఇస్మాయిల్‌తో కలిసి అహ్మద్ భారత రోయర్లకు మటన్, చికెన్ సరఫరా చేసేందుకు జాతీయ శిక్షణ శిబిరానికి తరచుగా వచ్చేవాడు. గంటల తరబడి పట్టుదలతో సాధన చేసే రోయర్లను జాగ్రత్తగా గమనించేవాడు. అదే అహ్మద్‌ను రోయింగ్‌వైపు ఆసక్తి కలిగేలా చేసింది. కంపు కొట్టే మురికి నీళ్లలోనే తన బంగారు భవిష్యత్తును వెతుక్కున్నాడు. అదే ఇప్పుడు ఆసియా క్రీడల్లో భారత్ తరఫున పాల్గొనే అద్భుతమైన అవకాశం దక్కేలా చేసింది. -సాక్షి క్రీడావిభాగం
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నీళ్లపై రోయర్లు చేసే సాధన అంతర్జాతీయంగా భారత్‌కు పతకాల పంట పండిస్తోంది. అరుుతే ఈ జల క్రీడలో సర్వీసెస్ ఆటగాళ్లదే హవా. ముందు నుంచీ వాళ్లదే ఆధిపత్యం. అరకొర వసతులు, ప్రతికూల వాతావరణంలో సాగే శిక్షణకు వాళ్లు మినహా స్థానికుల ప్రాతినిధ్యం కరువే. కానీ ఈ పరిస్థితుల్లో అహ్మద్‌కు సహజసిద్ధంగానే రోయింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. టీనేజ్‌లో ‘ద్రోణాచార్య’ ఇస్మాయిల్ బేగ్ ఆధ్వర్యంలో రోయింగ్‌లో శిక్షణ మొదలు పెట్టాడు. అనతి కాలంలో రోయింగ్‌లో మంచి ప్రతిభను కనబర్చాడు. తొలుత సబ్ జూనియర్, ఆ తర్వాత జూనియర్, సీనియర్ స్థాయిలో తానేంటో నిరూపించుకున్నాడు. 2007 సబ్ జూనియర్ నేషనల్స్‌లో ఏపీ తరఫున పాల్గొని రజత పతకం సాధించాడు. కోల్‌కతా చాలెంజ్ టోర్నమెంట్‌లో స్వర్ణం సాధించడంలో అతనిదే కీలక పాత్ర. తన ప్రతిభతో జాతీయ క్యాంప్‌లో చోటు దక్కించుకున్న అహ్మద్ ఆపై భారత జట్టులో సభ్యుడయ్యాడు.
కవాడిగూడ నుంచి ఏషియాడ్: హైదరాబాద్‌లోని కవాడిగూడలో నివసించే మొహవ్ముద్ అహ్మద్‌లోని నైపుణ్యాన్ని కోచ్ ఇస్మాయిల్ మరింతగా వెలికితీశారు. భారత రోయింగ్ సమాఖ్య సహకారం కూడా తోడవడంతో రోయింగ్‌లో కీలకమైన కాక్స్‌లెస్ ఎయిట్‌లో కాక్స్‌వెయిన్‌గా ఎంపికయ్యాడు. కాక్స్‌వెయిన్‌గా తనకున్న అతి తక్కువ సమయంలో పరిస్థితులకు అనుగుణంగా రోయర్లకు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. 2011, 2013లలో ఆసియా చాంపియన్‌షిప్‌లో ఈ విభాగంలోనే రజతం సాధించడంలో వుుఖ్య భూమిక పోషించాడు. అతని ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని రోయింగ్ సమాఖ్య ఏషియాడ్‌కు ఎంపిక చేసింది.
లక్ష్యం ఒలింపిక్స్: ప్రతీ క్రీడాకారుడి లక్ష్యం ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం. అహ్మద్ లక్ష్యం కూడా అదే. 2016లో రియోలో జరిగే ఒలింపిక్స్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంతకంటే ముందు ఏషియాడ్‌లో మెడల్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. భారత్‌లో అందరిలాగే అహ్మద్‌కు క్రికెట్ అంటే ఇష్టం. భారత క్రికెటర్లలో కోహ్లికి వీరాభివూని. అతని హెయిర్ స్టయిల్‌ను తను ఫాలో అవుతాడు.