సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ సీజన్‌లో హనుమ విహారి సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ఇప్పటికే 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సాధించిన అతను తాజాగా మరో శతకంతో చెలరేగాడు. రంజీ ట్రోఫీలో అతను వరుసగా మూడో సెంచరీ సాధించడం విశేషం. విహారి రాణించడంతో కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు బుధవారం ఆట ముగిసే సరికి హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది.
విహారి (296 బంతుల్లో 145; 16 ఫోర్లు) శతకానికి తోడు అహ్మద్ ఖాద్రీ (131 బంతుల్లో 74; 10 ఫోర్లు) అర్ధ సెంచరీతో అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 134 పరుగులు జోడించడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ 266 పరుగులు ముందంజలో ఉంది. అమోల్ షిండే (79 బంతుల్లో 48 బ్యాటింగ్; 6 ఫోర్లు), ఆశిష్ రెడ్డి (19 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాచ్ చివరి రోజు గురువారం మరి కొద్ది సేపు ఆడి కేరళకు లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. తొలి రోజు తరహాలో వికెట్ బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తే హైదరాబాద్‌కు విజయావకాశాలుంటాయి లేదా మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఉన్నాయి.
కీలక భాగస్వామ్యం....
ఓవర్‌నైట్ స్కోరు 46/1తో హైదరాబాద్ మూడో రోజు ఆట ప్రారంభించింది. కొద్ది సేపటికే నియాస్ బౌలింగ్‌లో సందీప్ (102 బంతుల్లో 30; 5 ఫోర్లు) వెనుదిరగ్గా...ఆ వెంటనే రవితేజ (2) కూడా అదే బౌలర్ చేతిలో అవుటయ్యాడు. ఈ దశలో విహారి, ఖాద్రీ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ క్రమంలో విహారి 87 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి సెషన్ ముగిసే సరికి హైదరాబాద్ 3 వికెట్లకు 136 పరుగులు చేసింది. లంచ్ అనంతరం కొద్ది సేపటికే 101 బంతుల్లో ఖాద్రీ సెంచరీ పూర్తయింది.
కొద్ది సేపటికే పద్మనాభన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి ఖాద్రీ బౌల్డయ్యాడు. మరో వైపు ఎంతో ఏకాగ్రత ప్రదర్శిస్తూ చక్కటి షాట్లు ఆడిన విహారి 216 బంతుల్లో ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో నాలుగో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టీ విరామం వరకు జట్టు స్కోరు 239/4కు చేరింది. షిండే అండతో స్కోరు పెంచే ప్రయత్నం చేసిన విహారి చివరకు నియాస్ బౌలింగ్‌లో కీపర్ సురేంద్రన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. ఆ తర్వాత షిండే, ఆశిష్ జాగ్రత్తగా ఆడి మూడో రోజు ఆటను ముగించారు.
ఎనిమిదో ఆటగాడు...
రంజీ ట్రోఫీలో వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీ సాధించిన ఎనిమిదో హైదరాబాద్ క్రికెటర్‌గా విహారి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతనికంటే ముందు సహచరుడు అక్షత్ రెడ్డి (2011-12 సీజన్) కూడా ఈ ఘనత సాధించాడు.
సీనియర్ తరంలో ఎంఎల్ జైసింహా (64-65), విజయ్ మోహన్ రాజ్ (85-86, 86-87), ఎంవీ శ్రీధర్ (95-96), వీవీఎస్ లక్ష్మణ్ (95-96)లో వరుసగా మూడు రంజీ మ్యాచుల్లో శతకాలు చేశారు.
వీవీఎస్ లక్ష్మణ్ 1999-2000 సీజన్‌లో వరుసగా 5 మ్యాచ్‌లలో సెంచరీలు చేయగా...ఎంవీ శ్రీధర్ 1990-91, 91-92 సీజన్లలో వరుసగా 4 సెంచరీలు చేయడం విశేషం.
విహారి ‘తీన్‌మార్’
Published Thu, Jan 2 2014 12:02 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement