ధోనిపై కామెంట్స్.. హర్ష్ యూటర్న్
పుణే: మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీ, ఆటతీరుపై విమర్శలు చేసిన రైజింగ్ పుణె జట్టు యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు, వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా యూటర్న్ తీసుకున్నారు. అత్యుత్తమ ఫినిషర్ అంటూ ఆకాశానికెత్తారు. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో పుణెను ‘మిస్టర్ కూల్’ గెలిపించాడు. 31 బంతుల్లో 61 పరుగులు బాదాడు. దీంతో ధోనిపై హర్ష్ గోయెంకా ప్రశంసలు కురిపించారు. ‘ధోని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతడు మళ్లీ ఫామ్ లోకి రావడం గొప్పగా అన్పిస్తోంది. అతడిని మించిన ఫినిషర్ లేడ’ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.
హర్ష్ గోయెంకా తాజా వ్యాఖ్యలపై ధోని అభిమానులు ట్విటర్ లో కామెంట్లు పెట్టారు. ధోని ధనాధన్ ఇన్నింగ్స్ హర్ష్ కు చెంపదెబ్బ అని, అడవికి రాజు ఎవరో తేలిపోయిందని వ్యాఖ్యానించారు. హర్ష్.. ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని, ధోని జట్టు నుంచి వెళ్లిపోవాలని కొద్ది రోజుల క్రితం ఆయన కోరుకున్నారని గుర్తు చేశారు. ఇంతకుముందు ధోనిపై చేసిన వ్యాఖ్యలను తమకెంతో బాధ కలిగించాయని, అతడిపై తమకున్న అభిమానాన్ని ఎవరూ చెరిపివేయలేరని ఫ్యాన్స్ స్పష్టం చేశారు.
‘అడవికి రాజు ఎవరో అనేది స్మిత్ నిరూపించాడు. ధోనిని ప్రేక్షక పాత్రకే పరిమితం చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్. అతడిని కెప్టెన్‌గా నియమించడం సరైన నిర్ణయం’ అని హర్ష్ చేసిన ట్వీట్ పై దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.