ఈ పతకం నాకొద్దు | i dont want this medal | Sakshi
Sakshi News home page

ఈ పతకం నాకొద్దు

Published Thu, Oct 2 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

ఈ పతకం నాకొద్దు

ఈ పతకం నాకొద్దు

కాంస్యాన్ని నిరాకరించిన భారత బాక్సర్ సరితా దేవి

 ఇంచియాన్: అంతర్జాతీయ క్రీడా వేదికపై ఇప్పటివరకు ఏ భారతీయ క్రీడాకారుడు చేయని  సాహసాన్ని భారత మహిళా బాక్సర్ సరితా దేవి చేసింది. ఇంచియాన్ ఆసియా క్రీడల్లో తాను నెగ్గిన కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు ఈ మణిపూర్ బాక్సర్ నిరాకరించింది. దక్షిణ కొరియా బాక్సర్ పార్క్ జీనాతో మంగళవారం జరిగిన 60 కేజీల విభాగం సెమీఫైనల్లో సరితా దేవి ఓడిపోయింది. అయితే ఈ బౌట్‌లో తాను పూర్తి ఆధిపత్యం కనబరిచినా బౌట్ నిర్ణేతలు పక్షపాతంగా వ్యవహరించి కొరియా బాక్సర్‌కు అనుకూల నిర్ణయం ఇచ్చారని సరితా దేవి ఆరోపించింది.

బుధవారం 60 కేజీల విభాగం పతకాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సరితా దేవి ఊహించని రీతిలో నిరసన వ్యక్తం చేసింది. కాంస్య పతకాన్ని తన మెడలో వేసేందుకు వచ్చిన అతిథి నుంచి ఆమె పతకం స్వీకరించేందుకు నిరాకరించింది. చేతిలో ఆ పతకాన్ని తీసుకొని ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న కొరియా బాక్సర్ పార్క్ జీనా వద్దకు వెళ్లి ఆమె మెడలో తన కాంస్య పతకాన్ని వేసింది. కాసేపటి తర్వాత పార్క్ తన మెడలో వేసిన కాంస్య పతకాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించినా సరిత తీసుకోకుండా పోడియం దగ్గర్నించి వెళ్లిపోయింది. దీంతో ఆ కాంస్య పతకాన్ని నిర్వాహకులు తమ వద్దే ఉంచుకున్నారు.

 ‘ఐబా’ విచారణ: సరితా దేవి సంఘటనపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) విచారణ చేపట్టింది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన ఆమెపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని ‘ఐబా’ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసియా క్రీడలు ముగిశాక సరితా దేవిపై నిర్ణయం తీసుకుంటామని ‘ఐబా’ వివరించింది.


 

Advertisement

పోల్

Advertisement