భారత్ లో మాపై ప్రేమ ఎక్కువ: అఫ్రిది
కోల్ కతా: పాకిస్తాన్ లో ఉన్నప్పటి కంటే భారత్ లోనే ఎక్కువ సంతోషంగా ఉంటానని ఆ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది చెప్పాడు. భారత్ తో క్రికెట్ అనగానే ఎప్పుడూ చాలా ఎంజాయ్ చేస్తానని మీడియా సమావేశంలో అఫ్రిది అన్నాడు. ఇక్కడి వారు తమ జట్టు భారత్ కు వచ్చిన ప్రతిసారి చాలా ప్రేమగా, ఆప్యాయతతో మమ్మల్ని ఆహ్వానిస్తారని తెలిపాడు. నిజం చెప్పాలంటే స్వదేశంలో కూడా తమకు అభిమానుల నుంచి ఇంత ప్రేమ దొరకదని వ్యాఖ్యానించాడు. ఇటీవల కాలంలో భారత్ మెరుగైన ప్రదర్శన ఇస్తుందని, టీ20 ప్రపంచ కప్ లో భాగంగా మార్చి 19న భారత్ తో జరగనున్న మ్యాచ్ తమకు కీలకమని పాక్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
పాక్, భారత్ దేశాలను క్రికెట్ చాలా దగ్గర చేసిందని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఆట, రాజకీయం అనేది రెండు భిన్నమైన అంశాలని చెప్పాడు. తొలి మ్యాచ్ ఎప్పిటికీ చాలా ముఖ్యమైనదని, అందుకే బంగ్లాదేశ్ తో జరగనున్న మ్యాచ్ నుంచే తమ పోరు ప్రారంభమవుతుందని పేర్కొన్నాడు. రెండో మ్యాచ్ భారత్ తో ఉందని, ఆ మ్యాచ్ కూడా తమకు చాలా టఫ్ అని అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్ లో పాక్ ఓటమి గురించి ప్రస్తావిస్తూ... విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ పోరాటం తమ జట్టు నుంచి విజయాన్ని లాగేసుకున్నాయని తెలిపాడు. తమ బౌలర్ల ప్రదర్శనపై పూర్తి నమ్మకం ఉందని పాక్ కెప్టెన్ అఫ్రిది అంటున్నాడు.