ఆ తరువాత క్రికెట్ బ్యాట్ పట్టుకోలేదు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో పునరాగమనం కోసం సీనియర్ ఆటగాళ్లు ఆపసోపాలు పడుతుంటే... గత జూన్ లో బంగ్లాదేశ్ పర్యటన అనంతరం జాతీయ జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కనీసం బ్యాట్ ను గానీ బంతిని గానీ పట్టుకోలేదట. తాను జట్టులో స్థానం కోల్పోయిన తరువాత స్నేహితులతోనూ, హార్స్ రైడింగ్ చేస్తూ తన సరదాలను తీర్చుకున్నానని తాజాగా వెల్లడించాడు. కేవలం రంజీట్రోఫీ మ్యాచ్ లకు ముందే తాను ప్రాక్టీస్ చేసి బరిలోకి దిగానన్నాడు.
'నేను బంగ్లాదేశ్ మ్యాచ్ ల అనంతరం చాలా నెలల పాటు ప్రాక్టీస్ చేయలేదు. స్నేహితుల్ని కలవడం, హార్స్ రైడింగ్ చేయడం మాత్రమే చేశాను. కనీసం దగ్గర్ల ఉన్న ఏ క్రికెట్ గ్రౌండ్ కూ వెళ్లలేదు. క్రికెట్ కు సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. కొన్నాళ్లు క్రికెట్ ను మనసుకు దూరంగా ఉంచుదామనే ఉద్దేశంతోనే ఆ పని చేశా. అయితే రంజీ సీజన్ కు ముందు మాత్రమే క్రికెట్ బ్యాట్ ను , బంతిని పట్టుకున్నా' అని జడేజా తెలిపాడు.
దేశవాళీ క్రికెట్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో చెలరేగిన ఈ ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు తిరిగి జట్టులోకి ఆహ్వానించారు. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి రెండు టెస్టులకు ప్రకటించిన 16 మంది సభ్యుల బృందంలో జడేజా కల్పించారు. రంజీల్లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన జడేజా ఆడిన రెండు మ్యాచ్ ల్లో చెలరేగి పోయిన సంగతి తెలిసిందే. త్రిపురతో జరిగిన తొలి మ్యాచ్ లో 11 వికెట్లు తీసి సౌరాష్ట్ర గెలుపులో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కించుకున్న జడేజా.. అనంతరం జార్ఖండ్ తో జరిగిన మ్యాచ్ లో 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.