
ముంబై: టీమిండియాతో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20లో వెస్టిండీస్ ఓటమి పాలుకావడంతో ఆ జట్టు కెప్టెన్ కీరోన్ పొలార్డ్ అసహనం వ్యక్తం చేశాడు. తమ ప్రణాళికల్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలం కావడంతోనే ఈ ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చిందన్నాడు. ప్రత్యేకంగా నిలకడలేని బౌలింగే తమ కొంప ముంచిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత జట్టులో క్లాస్ ఆటగాళ్లు ఉన్నప్పుడు బౌలింగ్ అనేది ఎంతో నియంత్రణతో ఉండాలన్నాడు. అటువంటిది తమ బౌలర్లు పూర్తిగా లైన్ తప్పారన్నాడు. ప్రధానంగా కోహ్లికి అతనే ఆడే స్లాట్‌లోనే పలు బంతుల్ని వేయడం సరైనది కాదన్నాడు. కోహ్లి ఒక అసాధారణ బ్యాట్స్‌మన్ అని, అతనిలాంటి బ్యాట్స్‌మన్‌కు చెత్త బంతులు వేస్తే వాటిని బౌండరీ ద్వారానే సమాధానం చెబుతాడన్నాడు. తాము తమ ప్రణాళికల్ని అమలు చేసే ఉంటే అసలు ఈ చర్చే ఉండేది కాదన్నాడు. ఇక మ్యాచ్‌లో విజయానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయన్నాడు. తాము టీ20 సిరీస్‌ను మొదలు పెట్టినప్పుడు సిరీస్ ఫలితం చివరి వరకూ వెళుతుందని అనుకోలేదన్నాడు.
ఇక చివరి మ్యాచ్‌లో భారత్ చేసిన 240 పరుగులు పెద్ద స్కోరేమీ కాదన్నాడు. తమ చేతుల్లో వికెట్లు ఉండి ఉంటే కచ్చితంగా గెలిచి ఉండేవాళ్లమన్నాడు. తమ బ్యాటింగ్ లైనప్‌లో నిలకడ మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నాడు. వన్డే సిరీస్‌లో ప్రణాళికల్ని అమలు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామని పొలార్డ్‌పేర్కొన్నాడు. ఆఖరి టి20లో భారత్ 67 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడింది. పొలార్డ్ (39 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) కాసేపు పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.