కంగారెత్తించాలి!
► ఆస్ట్రేలియాతో నేడు తొలి వన్డే
► ఊపు మీదున్న టీమిండియా
► ఓపెనర్‌గా రహానే
శ్రీలంక పర్యటనలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లను చూసి విసిగిపోయిన అభిమానులకు ఇక పండగే. సొంత గడ్డపై పోటాపోటీగా సాగే వన్డేలను వీక్షించేందుకు వారు సిద్ధం కావాల్సిందే. నేటి నుంచి ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌ను ప్రారంభించబోతోంది. ఇరు జట్లలోనూ సూపర్ బ్యాట్స్‌మెన్ ఉండటంతో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. అటు శ్రీలంకతో జరిగిన మూడు ఫార్మాట్లలోనూ 9–0తో నెగ్గి ఎదురులేకుండా ఉన్న కోహ్లి సేన ఇక ఆసీస్ భరతం పట్టాలని చూస్తోంది. కానీ ఈ పోరు మాత్రం అంత సులువేమీ కాకపోవచ్చు. ఇక్కడి పరిస్థితులపై చాలా మంది ప్రత్యర్థి ఆటగాళ్లకు మంచి అవగాహనే ఉంది. ఐపీఎల్ పుణ్యమా అని వారు భారత్‌ను తమ రెండో సొంత దేశంగా పరిగణిస్తారనడంలో సందేహం లేదు. అయితే స్వదేశీ అభిమానుల మద్దతుతో ఎప్పటిలాగే ఈ సిరీస్‌లోనూ చెలరేగి మరో క్లీన్‌స్వీప్ సాధించాలనే ఆలోచనతో భారత్ ఉంది.
మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
చెన్నై: వరుసగా టెస్టులు, వన్డేలు, టి20 మ్యాచ్‌ల విజయం జోష్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు స్వదేశీ గడ్డపై కఠిన సిరీస్‌కు సిద్ధమవుతోంది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో నేటి నుంచి ఐదు వన్డేల పోరు కోసం బరిలోకి దిగబోతోంది. తొలి మ్యాచ్‌కు స్థానిక ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక కానుంది. 1987లో రిలయన్స్ కప్ అనంతరం మరోసారి ఇరు జట్లు ఇక్కడ ఆడటం ఇదే ప్రథమం. ఇక శ్రీలంకపై అన్ని ఫార్మాట్లలో క్లీన్‌స్వీప్ సాధించినా ఇప్పుడు ఆసీస్‌తో ఆడబోయే మ్యాచ్‌లు మాత్రం ఆడుతూ పాడుతూ సాగేవి కావనే విషయం భారత్‌కూ తెలుసు. ఆసీస్ జట్టులో నాణ్యమైన బౌలర్లతో పాటు విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌కు కొదవలేదు.
సిరీస్‌కు ముందే పేసర్లు మిషెల్ స్టార్క్, హాజెల్‌వుడ్ గాయాలతో దూరమైనా కూల్టర్ నీల్, కమిన్స్, ఆడమ్ జంపాలాంటి నాణ్యమైన బౌలర్లతో పటిష్టంగా ఉంది. అంతేకాకుండా 2013 పర్యటనలో ఇక్కడ ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో ఉంది. అయితే సొంతగడ్డపై బెబ్బులిలా విరుచుకుపడే భారత్‌ను ఎదుర్కోవడం అటు ఆసీస్‌కు అంత సులువేమీ కాదు. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ తమ విజయ యాత్రను ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగించాలనే ఆలోచనలో ఉంది. ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత కారణాలతో దూరమైనా జట్టు రిజర్వ్ బెంచ్ పటిష్టంగానే ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో మైదానంలో పరుగుల వరద ఖాయంగానే కనిపిస్తోంది.
భారత్ ఫుల్ జోష్...
జట్టులో అంతా ఫామ్‌లో ఉండటం శుభపరిణామం. ధావన్ తొలి మూడు వన్డేలకు అందుబాటులో లేకపోవడంతో ఓపెనర్‌గా అజింక్యా రహానే రావడం ఖాయం. గత వెస్టిండీస్ పర్యటనలో అతను విశేషంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఇక భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్‌కు ఆసీస్‌పై ఘనమైన రికార్డే ఉంది. చివరిసారిగా ఆసీస్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో అతను డబుల్ సెంచరీతో చెలరేగాడు. వన్‌డౌన్‌లో కోహ్లి ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.అతడిని అడ్డుకోవడంపైనే ఆసీస్ విజయావకాశాలుంటాయని ఆసీస్ కెప్టెన్ స్మిత్ అంగీకరించాడు.
అయితే మిడిలార్డర్‌పై టీమ్ మేనేజిమెంట్ కొంచెం ఆందోళనలో ఉంది. నాలుగో నంబర్ స్థానంలో కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతున్నాడు. అతడి స్థానంలో ఫామ్‌లో ఉన్న మనీష్ పాండేకు అవకాశమిస్తారా అనేది వేచి చూడాలి. ఇక ధోని లంకపై ఆడిన వన్డేల్లో నాటౌట్‌గానే నిలిచి సత్తా చూపాడు. బౌలింగ్‌లో లంకపై రాణించిన బృందాన్నే కొనసాగించే అవకాశాలున్నాయి. అదే జరిగితే షమీ, ఉమేశ్ యాదవ్ బెంచికే పరిమితం కావాల్సి ఉంటుంది. లెగ్ స్పిన్నర్లు కీలకం కావడంతో కుల్దీప్‌తో పాటు చాహల్ ఆడే అవకాశం ఉంది. మరోవైపు శనివారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా స్పిన్నర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అతని స్థానంలో తొలి మూడు వన్డేలకు రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు.
ఒత్తిడి ఆసీస్‌పైనే..
చివరిసారి ఇక్కడి పర్యటనలో ఆసీస్ 2–3తో ఓడింది. ఈసారి కూడా తమ టాప్ పేసర్లు లేకుండానే వచ్చింది. దీంతో సహజంగానే కాస్త ఒత్తిడి నెలకొంది. అయితే ఆ పర్యటనలో లేని స్మిత్ ఇప్పుడు జట్టును నడిపిస్తున్నాడు. ఈ పర్యటనకు ముందు ఆసీస్ బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఒకటి ఓడిన అనుభవంతో ఉంది. ఇక భారీ హిట్టర్ ఆరోన్ ఫించ్ గాయంతో దూరమవడం గట్టి షాకే. ఈ ఇబ్బందులు ఎలా ఉన్నా జట్టులో దాదాపు అందరికీ ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉండటంతో భారత పిచ్‌లపై ఎలా ఆడాలో క్షుణ్ణంగా తెలుసు. వార్నర్, హెడ్, స్టొయినిస్ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. పేసర్లు కమిన్స్, ఫాల్క్‌నర్, కూల్టర్ నీల్ ప్రభావం చూపించగలరు.
నా దృష్టంతా జట్టుకు విజయాలు అందించడమే. సెంచరీల కోసం నేనెప్పుడూ ఆడింది లేదు. అందుకేనేమో వాటంతట అవే వస్తున్నాయి. 99 దగ్గర నాటౌట్‌గా నిలిచినా లెక్క చేయను. ఆ పరుగులతో జట్టు గెలిస్తే చాలు. ఇక రాహుల్‌కు అద్భుత నైపుణ్యం ఉంది. అన్ని ఫార్మాట్లలో తానేమిటో నిరూపించుకున్నాడు. అతడు ఫామ్‌ను అందుకోవడానికి ఒక్క మ్యాచ్ చాలు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ప్రతీ ఆటగాడు ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. టి20ల్లో నేను ఓపెనింగ్‌కు దిగుతాను. జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉండటం లాభమే. ఎవరితో సిరీస్ అయినా మా సాధనలో మార్పు ఉండదు. –విరాట్ కోహ్లి (భారత కెప్టెన్)
ఈ వన్డే సిరీస్‌లో మేం కుల్దీప్‌ను ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకుంది. అలాంటి బౌలర్ కేకే జియాస్‌తో మేం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాం. కుల్దీప్‌లాంటి బౌలర్లు ప్రపంచ క్రికెట్‌లో ఎక్కువగా లేరు. మాలో కొందరు అతడిని ఐపీఎల్‌లో ఎదుర్కొన్నారు. ఆరంభంలోనే అతడిపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నాం. –స్టీవ్ స్మిత్ (ఆసీస్ కెప్టెన్)
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్ ఇది. ఇక్కడ సగటు స్కోరు 264 పరుగులు. మధ్యా హ్నం ఉరుములతో కూడిన వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
321 జనవరి, 2013 నుంచి ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు.
22 గత ఐదేళ్లలో రెండు జట్ల బ్యాట్స్‌మెన్ నుంచి వచ్చిన సెంచరీల సంఖ్య.
6 రెండు జట్లు 300కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఆరు సార్లు ఛేదించాయి.
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రహానే, జాదవ్, ధోని, పాండే /రాహుల్, పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్, చాహల్, బుమ్రా.
ఆసీస్: స్మిత్ (కెప్టెన్), వార్నర్, హెడ్, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, వేడ్, ఫాల్క్‌నర్, కూల్టర్ నీల్, కమిన్స్, జంపా.