పుణే టెస్టులో భారత్‌కు 326 పరుగుల ఆధిక్యం | India vs South Africa 2nd Test Match At Pune Day 3 | Sakshi
Sakshi News home page

శాసించేది మనమే

Published Sun, Oct 13 2019 1:24 AM | Last Updated on Sun, Oct 13 2019 10:02 AM

India vs South Africa 2nd Test Match At Pune Day 3 - Sakshi

ఇక ఈ టెస్టే కాదు... సిరీసే మన చేతిలోకి వచ్చేసినంత సంబరం. మూడు టెస్టుల సిరీస్‌ విజేత రెండో టెస్టు మూడో రోజే దాదాపు ఖరారైంది. ఇప్పటికైతే భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. ఇక మిగిలింది భారీ విజయమే! ఈ రెండు రోజుల్లో ఎంత తేడాతో విరాట్‌ సేన గర్జిస్తుందో చూడాలంటే పుణే మ్యాచ్‌పై ఓ కన్నేయాలి. మూడో రోజు సఫారీ పతనం పేస్‌తో మొదలైంది. స్పిన్‌తో పరిపూర్ణమైంది. పేస్‌ ద్వయం ఉమేశ్, షమీల బౌలింగ్‌ను టాపార్డర్, మిడిలార్డర్‌ ఎదుర్కోలేకపోయింది. మిగతా బ్యాటింగ్‌ అశ్విన్‌ స్పిన్‌లో చిక్కుకుంది. కానీ... కేశవ్‌ మహరాజ్, ఫిలాండర్‌ పోరాటమే భారత శిబిరాన్ని కాస్త ఇబ్బంది పెట్టింది. ఆలౌట్‌ను కాస్త ఆలస్యం చేసింది.  

పుణే: భారత్‌ ఆటను రెండో రోజు నాయకుడు నడిపిస్తే... ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను మూడో రోజు బౌలర్లు  పడేశారు. టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టారు. రెండో టెస్టులో భారత్‌కు 326 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. కేశవ్‌ మహరాజ్‌ మొండిగా పోరాడకుంటే ఆతిథ్య జట్టుకు 400 పైచిలుకు పరుగుల ఆధిక్యం దక్కేది. శనివారం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 105.4 ఓవర్లలో 275 పరుగుల వద్ద ఆలౌటైంది.

లంచ్‌ వరకే మరో మూడు వికెట్లను, రెండో సెషన్‌లో ఇంకో రెండు వికెట్లను కోల్పోయిన సఫారీ జట్టు... ఆఖరి సెషన్లో చివరి రెండు వికెట్లతోనే 78 పరుగులు జతచేయడంతో సఫారీ రోజంతా ఆడగలిగింది. పదో వరుస బ్యాట్స్‌మన్‌ కేశవ్‌ మహరాజ్‌ (132 బంతుల్లో 72; 12 ఫోర్లు) ఒక్కడే జట్టు పరువు నిలిపే బాధ్యత మోశాడు. ఫిలాండర్‌ (192 బంతుల్లో 44 నాటౌట్‌; 6 ఫోర్లు) అండతో పోరాడాడు. డు ప్లెసిస్‌ (117 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా... టీమిండియా బౌలర్లలో అశి్వన్‌ 4, ఉమేశ్‌ 3, షమీ 2 వికెట్లు తీశారు.

వికెట్ల వేటతోనే ఆట షురూ...
ఆటతో పాటు వికెట్ల వేట కూడా మొదలైంది. మూడో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 36/3తో శనివారం ఆట కొనసాగించిన సఫారీ జట్టు మరో 5 పరుగులు మాత్రమే జతచేసి నోర్జే (3) వికెట్‌ను కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో కోహ్లి క్యాచ్‌ పట్టడంతో అతను వెనుదిరిగాడు. కాసేపటికే జట్టు స్కోరు 50 పరుగులు దాటాయో లేదో మరో వికెట్‌ కూలింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ డి బ్రుయిన్‌ (58 బంతుల్లో 30; 6 ఫోర్లు) ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి ఐదో వికెట్‌గా ని్రష్కమించాడు. దీంతో 53 పరుగులకే దక్షిణాఫ్రికా సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెపె్టన్‌ డు ప్లెసిస్‌కు వికెట్‌ కీపర్‌ డికాక్‌ జతయ్యాడు.
 
రాణించిన డు ప్లెసిస్‌...
అనుభవజు్ఞలైన డు ప్లెసిస్, క్వింటన్‌ డికాక్‌ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు వీరిద్దరూ జాగ్రత్తగా ఆడారు. జట్టు స్కోరు కనాకష్టంగా 100 పరుగులు దాటింది. అదుపుతప్పిన బంతిని బౌండరీకి తరలిస్తూ డు ప్లెసిస్‌ వేగంగా అర్ధసెంచరీకి చేరువయ్యాడు. 64 బంతుల్లోనే 8 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో అతను ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. వీళ్లిద్దరు ఆరో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. కానీ ఈ భాగస్వామ్యం మరింత బలపడకముందే లంచ్‌ విరామం లోపే అశి్వన్‌... డికాక్‌ (48 బంతుల్లో 31; 7 ఫోర్లు)ను బౌల్డ్‌ చేశాడు.

కేశవ్‌ పోరాటం...
రెండో సెషన్‌ ఆరంభమైన కాసేపటికే ముత్తుసామి (7)ని జడేజా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కాసేపయ్యాక డు ప్లెసిస్‌ కూడా స్పిన్‌ ఉచ్చులోనే పడ్డాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో రహానే క్యాచ్‌తో అతను పెవిలియన్‌ చేరాడు. 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన సఫారీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక 200 పరుగుల్లోపే దక్షిణాఫ్రికా ఖేల్‌ఖతం అనుకున్నారంత. అయితే స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ విలవిల్లాడిన పిచ్‌పై ఫిలాండర్, కేశవ్‌ అసాధారణ పోరాటపటిమ కనబరిచారు. ఈ ఇద్దరు 43.1 ఓవర్ల పాటు భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. ఆఖరి సెషన్‌ను అవలీలగా ఆడారు. ఈ క్రమంలో కేశవ్‌ 96 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. తొమ్మిదో వికెట్‌కు 109 పరుగులు జోడించాక కేశవ్‌ను, రబడ (2)ను అశి్వన్‌ ఔట్‌ చేయడంతో సఫారీ ఇన్నింగ్స్‌ ముగిసింది.

కోహ్లి ఎత్తుగడ ఏంటో...
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్న ఈ టెస్టులో ఆతిథ్య బౌలర్ల సమష్టి జోరు చూస్తే ఇన్నింగ్స్‌ విజయానికి ఇది సరిపోతుంది. కానీ కెప్టెన్‌ కోహ్లి ఎత్తుగడ ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారింది. అతను తన బౌలింగ్‌ దళానికి కాస్త విశ్రాంతి ఇవ్వాలనుకుంటే మాత్రం కచి్చతంగా రెండో ఇన్నింగ్స్‌ ఆడేందుకు ఓపెనర్లను బరిలోకి దింపే అవకాశముంది.

తొలి సెషన్‌ అంతా ఆడటం... లంచ్‌ తర్వాత పిచ్‌ పరిస్థితుల్ని బట్టి డిక్లేర్‌ చేసి ప్రత్యర్థి వికెట్లను తీయడం జరగొచ్చు. లేదంటే టీమ్‌తో సమాలోచన లు జరిపి ఫాలోఆన్‌ ఆడించినా ఆశ్చర్యం లేదు. ఆట ముగిశాక మీడియా సమావేశానికి వచి్చన స్పిన్నర్‌ అశి్వన్‌ కూడా ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. ‘ఫాలోఆన్‌’ లేదంటే రెండో ఇన్నింగ్స్‌ ఆడటమా అనేది కోహ్లినే నిర్ణయిస్తాడని చెప్పాడు.  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 601/5 డిక్లేర్డ్‌; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (బి) ఉమేశ్‌ 6; మార్క్‌రమ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉమేశ్‌ 0; డి బ్రుయిన్‌ (సి) సాహా (బి) ఉమేశ్‌ 30; బవుమా (సి) సాహా (బి) షమీ 8; నోర్జే (సి) కోహ్లి (బి) షమీ 3; డు ప్లెసిస్‌ (సి) రహానే (బి) అశ్విన్‌ 64; డికాక్‌ (బి) అశి్వన్‌ 31; ముత్తుసామి (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 7; ఫిలాండర్‌ (నాటౌట్‌) 44; కేశవ్‌ (సి) రోహిత్‌ (బి) అశి్వన్‌ 72; రబడ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్‌ 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్‌) 275.
వికెట్ల పతనం: 1–2, 2–13, 3–33, 4–41, 5–53, 6–128, 7–139, 8–162, 9–271, 10–275. బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 10–1–36–0, ఉమేశ్‌ 13–2–37–3, జడేజా 36–15–81–1, షమీ 17–3–44–2, అశ్విన్‌ 28.4–9–69–4, రోహిత్‌ శర్మ 1–1–0–0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement