మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ డా. వైఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం శ్రీలంకతో జరుగుతున్న చివరి మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది.
విశాఖ: మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ డా. వైఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం శ్రీలంకతో జరుగుతున్న చివరి మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. గత రెండు మ్యాచ్ల్లో ఆడిన తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా ఉన్న ఇరు జట్లు.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ను దక్కించుకోవాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచినే జట్టే అటు సిరీస్తో పాటు నంబర్ వన్ ర్యాంకును కూడా కైవసం చేసుకుంటుంది. దీంతో టీమిండియా ఆ ర్యాంకును తిరిగి చేజిక్కించుకోవాలని యోచిస్తోంది.
ఒకవేళ ధోని సేనకు ఓటమి ఎదురైతే ఏడో ర్యాంకు పడిపోకతప్పదు. ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ అనంతరం అగ్రస్థానాన్ని దక్కించుకున్న టీమిండియా.. శ్రీలంకతో తొలి మ్యాచ్ లో ఓటమి అనంతరం మూడో ర్యాంకుకు పడిపోయింది. ఆ తరువాత రెండో మ్యాచ్ లో గెలిచి తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఒకవైపు గెలుపు, మరొకవైపు ర్యాంకు ప్రధానం కావడంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.