
మరో స్టార్ ప్లేయర్‌కూ చాన్స్!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాబృందానికి స్ఫూర్తినిచ్చేందుకు గుడ్‌విల్ అంబాసిండర్‌గా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) స్పందించింది. సల్మాన్‌ను గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎందుకు నియమించామో తమ వైఖరిపై వివరణ ఇచ్చింది. ఈ నియామకంలో ఎలాంటి డబ్బు ప్రస్తావన లేదని, ఒలింపిక్ క్రీడలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆయనను అంబాసిడర్‌గా నియమించినట్టు తెలిపింది.
బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరైన సల్మాన్‌ను నియమించడం వల్ల ఒలింపిక్ క్రీడల ప్రాధాన్యం దేశమంతటా తెలిసే అవకాశముందని, తద్వారా దేశంలోనూ ఈ విశ్వక్రీడలు పాపులర్ అయ్యే అవకాశముందని ఐవోఏ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. క్రీడా, కళల రంగాలకు చెందిన మరింత ప్రముఖులను గుడ్‌విల్ అంబాసిడర్లుగా నియమించే అవకాశముందని స్పష్టం చేసింది. క్రీడారంగాల్లో అంతర్జాతీయంగా సత్తా చాటిన పీటీ ఉషా, అంజు బాబీ జార్జ్‌లను కూడా అంబాసిడర్‌లుగా నియమించవచ్చునని ఐవోఏ సెక్రటరీ రాజీవ్ మెహతా తెలిపారు. ఒలింపిక్స్‌లో భారతకు పతకాన్ని అందించిన పీటీ ఉషాను కూడా గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించే అవకాశాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి.